హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ) : స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చే స్తాం.. ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించడమే లక్ష్యంగా చర్యలు చేపడతాం.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలన్నీ ఉత్త ప్రగల్భాలేనని తేలిపోయిం ది. క్రీడాకారులను తయారు చేయడమేమోగానీ, కనీసం ప్రతిభ గల క్రీడాకారులకు సాయం అందించని దుస్థితి నెలకొన్నది. భువనగిరి ఆర్మ్‌డ్‌ఫోర్స్ గురుకుల డిగ్రీ కాలేజీకి చెందిన మమత, ఆర్మూర్ గు రుకుల డిగ్రీ కాలేజీకి చెందిన రాణి, ఇందు.. నిజామాబాద్ జిల్లా సుద్దపల్లిలోని స్పోర్ట్స్ అకాడమీలో సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ పొందారు.
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో గత నెలలో నిర్వహించిన శిబిరంలో పాల్గొని ప్రతిభ చా టారు. దీంతో తైవాన్‌లో ఈ నెల 15-19వరకు నిర్వహించనున్న 4వ ఏషియన్ యూనివర్సిటీ ఉమెన్ సాఫ్ట్‌బాల్ ఆసియా కప్ తైచుంగ్-2024 పోటీలకు వీరు ఎంపికయ్యారు. నేడు చెన్నై వెళ్లి అక్కడి నుంచి తైవాన్‌కు వెళ్లాల్సిం ది. వీరు అక్కడికి వెళ్లాలంటే ఒక్కొక్కరికి దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చయ్యే అవకాశమున్నది. ఆ మొత్తాన్ని ముందుగానే సాఫ్ట్‌బాల్ అసిసోయేషన్ ఆఫ్ ఇండియా అకౌంట్లో జమచేయాల్సి ఉంది. కానీ, వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు కావడంతో తమ పాఠశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా సొసైటీ సెక్రటరీకి లెటర్ పెట్టుకున్నారు.
పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. దీంతో వారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఆర్థికసాయం అందించాలని అభ్యర్థించారు. దీంతో ఆయన సొసైటీ సెక్రటరీకి లేఖ రాశారు. అయినప్పటికీ క్రీడాకారులకు సొసైటీ రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వం తరఫున కూడాఎలాంటి సాయం అందని దుస్థితి. అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇదేనా ప్రభుత్వ క్రీడాపాలసీ అంటూ సొసైటీవర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ గురుకుల సొసైటీకి చెందిన హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు తిరుపతి జోర్డాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. అప్పుడు కూడా సొసైటీ ఏవిధమైన ఆర్థికసాయం అందించలేదు. దీంతో సదరు క్రీడాకారుడి పరిస్థితిని వివరిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేయగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చి ప్రయాణ తదితర ఖర్చులను భరించినట్టు ఉదహరిస్తున్నారు.