హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వరంగల్ జిల్లా గోపనపల్లికి చెందిన ప్రవల్లిక, కరీంనగర్ జిల్లా మామిడిపల్లికి చెందిన పావని, హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య, నిధాబేగం ఈ ఫెల్షిప్నకు ఎంపిక కాగా వారిని శనివారం సచివాలయానికి పిలిపించి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్య చదివే స్థోమతలేని విద్యార్థులకు ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒకో విద్యార్థికి రెండు సంవత్సరాలకు రూ. 55.50 లక్షల చొప్పున మొత్తం నలుగురు విద్యార్థులకు రెండు సంవత్సరాలకు రూ. 2.22 కోట్లు విడుదల చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేషన్లను బలోపేతం చేయాలి
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లను బలోపేతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శనివారం సచివాలయంలో కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీలతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కార్పొరేషన్లు ప్రభుత్వంపై ఆధారపడకుండా టెక్నాలజీ వినియోగించుకొని ఎదగడంపై దృష్టి పెట్టాలన్నారు. ఆయిల్‌పాం నర్సరీల్లో నాణ్యమైన మొకలు పెంచి, 2024-25 లక్ష్యాన్ని అందుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, స్టేట్ కోఆపరేటివ్ యూఎల్ చైర్మన్ మోహన్‌రెడ్డి, వేర్‌హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, మార్ఫెడ్ చైర్మన్ గం గారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌రావు, టెసో ఎండీ శైలజారామయ్యర్, వ్యవసాయశాఖ సంచాలకుడు గోపి, హార్టికల్చర్ సంచాలకురాలు యాస్మిన్, స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మి ఉన్నారు.