హైదరాబాద్, మే 2 ( నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలు పెట్టే ఖర్చుల వివరాలను ఆన్లైన్ ఆడిట్ నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తెలంగాణను వరుసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్‌గా ప్రకటించింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్టిన ఖర్చులపై ఆన్లైన్ ఆడిట్ వంద శాతం పూర్తయ్యింది. నిధుల ఖర్చులో పారదర్శకత కోసం ప్రతి గ్రామ పంచాయతీ ఆన్లైన్ ఆడిట్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే ఆన్లైన్ ఆడిట్ నిర్వహిస్తుండటం గమనార్హం. వంద శాతం ఆడిట్ పూర్తి చేసిన తెలంగాణను ఇతర రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. మన రాష్ట్ర అడిట్ అధికారులతో కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించింది.
కేసీఆర్, కేటీఆర్ కృషితో సాధ్యమైంది: ఎర్రబెల్లి దయాకర్‌రావు
గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆన్లైన్ ఆడిట్‌ను విజయవంతంగా పూర్తిచేయడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఉన్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ ఘనత సాధించిన పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని దయాకర్‌రావు ఒక ప్రకటనలో అభినందించారు. పంచాయతీలకు ప్రశంసలు, అవార్డులు, అభినందనలు కురిపిస్తున్న కేంద్రం రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ శాఖకు కేటీఆర్ అభినందన
స్థానిక సంస్థల్లో వంద శాతం ఆన్లైన్ ఆడిట్ లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందాన్ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అభినందించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండల పరిషత్తులు, 32 జిల్లా పరిషత్తుల్లో 100 శాతం ఆన్లైన్ ఆడిట్ లక్ష్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఆన్లైన్ ఆడిట్ విషయంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలంగాణను నేషనల్ లీడ్ స్టేట్‌గా కేంద్రం ప్రకటించినట్టు ఇటీవల ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు.