వనస్థలిపురం, అక్టోబర్ 23: ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భహుళ అంతస్తుల భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. సదరు భవనాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు నిర్మాణదారులకు ఇదివరకే నోటీసులు జారీచేశారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో బుధవారం వాటిని సీజ్ చేశారు. సాగర్ కాంప్లెక్స్‌లోని ప్లాట్ నంబర్ 272, 285లో ఒక భవనం, బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తాలోని ప్లాట్ నంబర్ 84లో ఒకటి, శ్రీపురం కాలనీలో ప్లాట్ నంబర్ 67లో ఒకటి, సచివాలయనగర్లోని ప్లాట్ నంబర్ సీ-754లో ఓ భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. మరోవైపు బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ, బీఎన్‌రెడ్డినగర్, వైదేహీనగర్, ఎస్కేడీనగర్, శ్రీరామ్ కాలనీలో దాదాపు అన్ని భవనాలూ అనుమతులు లేనివే.
ఇండ్ల కూల్చివేతకు మేం వ్యతిరేకం: రాఘవులు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవనం పేరిట నదికి ఆనుకొని ఉన్న ఇండ్లను తొలగించడానికి చేస్తున్న ప్రయత్నానికి సీపీఎం వ్యతిరేకమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రివర్ బెడ్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఆర్కు మొదట నిర్ణయించిన అలైన్‌మెంట్‌నే అమలు చేయాలని సూచించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయటంతోపాటు తక్షణమే రైతుభరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు.