హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఫ్రిజ్‌లో నిలువ ఉంచాల్సిన ఇన్సులిన్ ఔషధాన్ని ర్యాకుల్లో పెట్టి అమ్మకాలు చేపట్టిన దుకాణంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో బయట నిలువ చేస్తున్నట్టు సమాచారం తెలిసిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇన్సులిన్‌తోపాటు అక్రమంగా నిల్వచేసిన రూ.5 లక్షల విలువైన మందులనూ సీజ్ చేశారు. నగరంలోని అంబర్‌పేట పరిధిలోని పలు గోడౌన్లపై అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆక్రమంగా మెడికల్ షాప్‌లకు మందులను సరఫరా చేస్తున్న బషీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి గోదాము నుంచి రూ.20.52 లక్షల మందులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఆశ్లెయ్ ఫార్మాలో తయారైన మందులను అక్రమంగా ఇక్కడి మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.