కొత్తగూడ, జూలై 14 : మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్నారు. సొసైటీ ఎదుట ఆధార్‌కార్డులను క్యూలో ఉంచి సోమవారం పొద్దంతా ఎండను సైతం లెక్కచేయక బారులుదీరారు. కొందరు కార్డుల పక్కనే కూర్చో గా, మరికొందరు ఎండ తీవ్రతను తాళలేక పక్కనే ఉన్న చెట్లు, ట్రాక్టర్ ట్రాలీల కింద సేదదీరారు. పొగుళ్లపల్లి సొసైటీకి సోమవారం 888 బస్తాల యూరియా రాగా, ఎండలో పొద్దంతా పడిగాపులు పడినా తమకు రెండు బస్తాలే ఇచ్చారని కొత్తగూడ మండల రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పొగుళ్లపల్లిలో ఉన్న ఒకే సొసైటీ కొత్తగూడ, గంగారం మండలాల్లోని 69 గ్రామాలకు దిక్కుగా ఉందని, ఇక్కడికి ఎరువులు వచ్చా యా? లేదా? అనేది తమకు తెల్వడం లేదని, మరోపక్క వర్షాలు పడక మొలకెత్తిన పంట లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎరువుల కోసం తిరగాలో, పంటలకు నీళ్లు పెట్టుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పొగుళ్లపల్లి సొసైటీకి చేరుకొని రైతులతో మాట్లాడారు. మంత్రి సీతక్కకు రైతులు కష్టాలు కనిపించడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.