భద్రాచలం: భద్రాచలంలోని (Bhadrachalam) రాములవారి ఆయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్ర స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజైన శనివారం వామన అవతారంలో సీతారాములు దర్శనమిస్తారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం తిరువీధి సేవ నిర్వహించనున్నారు. కోలాట నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 10న వైకుంఠ ద్వారం ద్వారా సీతారామచంద్ర స్వామి దర్శనమిస్తారు. దీంతో ఈ నెల 10వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణాలను అధికారులు నిలిపివేశారు. కాగా, నాలుగో రోజైన శుక్రవారం నరసింహావతారంలో రామయ్య దర్శనమిచ్చారు. తొలుత స్వామివారిని ఆలయంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నిత్యకల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ పూజాధికాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. తర్వాత మిథిలా స్టేడియానికి మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు.