హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించడంతోపాటు పరిశుభ్రత, పౌష్టికాహారంలో తెలంగాణ అంగన్వాడీలు దేశానికే ఆదర్శంగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. గురువారం ఆమె సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రాలకు గ్రేడింగ్‌లు ఇచ్చిన విధంగా రాష్ట్రం జిల్లాలకు గ్రేడింగ్‌లు ఇచ్చే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తే, అందుకు బాధ్యులైన వారిని బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. అంగన్వాడీ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, డైరెక్టర్ కాంతివెస్లీ పాల్గొన్నారు.