ములుగు, ఏప్రిల్ 30 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దులకు ఆనుకొని ఉన్న కర్రెగుట్టలో కొనసాగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్‌లో భాగంగా బాంబుల శబ్దాలతో అడవి దద్దరిల్లుతున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టుల ఆచూకీ కోసం బలగాలు చేపడుతున్న తనిఖీల్లో.. మావోయిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో పేలుతున్నాయా? లేదా బలగాలకు మావోయిస్టులు తారసపడితే బాంబులు వేస్తున్నారా? లేదా మావోయిస్టులే బలగాలపైకి విసురుతున్నారా? అనేది తెలియడం లేదు. అయితే నడిపల్లి, పూజారీ కాంకేర్ ప్రాంతాలు మంగళవారం బాంబుల శబ్దాలతో హోరెత్తినట్టు తెలిసింది.
పోలీసులు తమను బయటకు రావద్దని ఆంక్షలు విధించారని స్థానికులు చెప్తున్నారు. 11 రోజులుగా ముమ్మర గాలింపు కొనసాగుతున్నా ఇంకా తెరపడటం లేదు. మావోయిస్టులు మృతి చెందారని ఇటీవల వచ్చిన వార్తల్లో, పుకార్లలో వాస్తవం లేదని తెలుస్తున్నది. ఈ విషయాలపై ఇప్పటి వరకు పోలీస్ బలగాలు అధికార ప్రకటన చేయకపోవడంతోపాటు ధ్రువీకరించలేదు. సుమారు 250 కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉండటంతో కర్రెగుట్టపైకి వెళ్తున్న బలగాలు అస్వస్థతకు గురైన క్రమంలో వారిని హెలికాప్టర్ల సహాయంతో బీజాపూర్ దవాఖానకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే కూంబింగ్‌లో అలసిపోయిన జవాన్లను రిఫ్రెష్ నిమిత్తం కిందకు తరలించి వారి స్థానంలో మరో టీమ్‌ను కూంబింగ్ కోసం పంపిస్తున్నట్టు సమాచారం.
రంగంలోకి దిగిన ఐబీ చీఫ్?
మావోయిస్టులను మట్టుపెట్టేందుకు సాగుతున్న కూంబింగ్‌ను భద్రతా బలగాలు సవాల్‌గా తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పర్యవేక్షణ నిమిత్తం ఐబీ చీఫ్ (ఇంటెలిజన్స్ బ్యూరో) తపన్ దేకా బుధవారం రంగంలోకి దిగినట్టు సమాచారం. రాయ్‌పూర్‌లో ఆపరేషన్‌పై అధికారులతో కీలక సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. మావోయిస్టుల ఆచూకీ కోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్ల సాయంతో బలగాల గాలింపు చేపడుతున్నట్టు సమాచారం. కర్రెగుట్టల సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు ఏ క్షణంలోనైనా తారసపడొచ్చనే ఆలోచనతో కంటి మీద కనుకు లేకుండా కాపు కాస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా కర్రె గుట్టలను పూర్తిగా భద్రతా దళాలు తమ గుప్పిట్లోకి తీసుకొని గుట్టపై జాతీయ జెండా ఎగురవేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెరపడని యుద్ధ వాతావరణం
కర్రెగుట్టల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణానికి తెరపడటం లేదు. ఇదిలావుండగా 5వ షెడ్యూల్ మైదాన ప్రాంతంలో పూర్తి హక్కులు ఆదివాసీలకే ఉన్నాయని, అటవీ ప్రాంతంలో బలగాలు మోహరించడం రాజ్యాంగ విరుద్ధ్దమని, వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని ఆదివాసీ, దళిత, గిరిజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి బలగాలను వెనక్కి రప్పించాలని, రక్తపాతం జరగకుండా చూడాలని గగ్గోలు చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలో ఉన్న కర్రెగుట్టల చుట్టుపక్కల ఆదివాసీ గూడేల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. రాత్రింబవళ్లు జరుగుతున్న కూంబింగ్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.
మంత్రి, కలెక్టర్‌కు వినతి
ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో జరుగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్‌ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ, దళిత, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు ములుగు కలెక్టరేట్‌ను ముట్టడించారు. వారు లోనికి వెళ్లకుండా పోలీసులు గేటు మూసివేయడంతో అక్కడే బైఠాయించారు. అనంతరం కలెక్టర్ టీఎస్ దివాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని మంత్రి సీతక్కను కలిసి ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్రానికి లేఖ రాస్తామని ఆమె హామీ ఇచ్చారు.
అనంతరం ఆ యా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టుల గాలింపు చర్యల నిమిత్తం కగార్ పేరుతో సైనిక చర్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ కారణంగా ఆదివాసీలు అనేక కష్టాలను అనుభవిస్తున్నారని, పోలీసుల భయంతో అనేక గూడేలు లోతట్టు ప్రాంతాలకు వలస పోయినట్టు తెలిపారు. ఈ నిరసనలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమనాల లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్‌కుమార్, గోర్ సభ జాతీయ అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, శాంతి చర్చల కమిటీ సభ్యుడు సోమ రామ్మూర్తి, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మంజాల భిక్షపతిగౌడ్, ట్రైబల్ డెమోక్రాటిక్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.