హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మవాణి కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఆదేశాలను కూడా సెక్షన్లలో ముందుకు కదలనీయడం లేదంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆ శాఖలో కలకలం రేపింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కమిషనర్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా పలువురి సమస్యలు పరిష్కారమవడమే కాకుండా ప్రధానంగా కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు అక్కడికక్కడే వెలువడ్డాయని, కానీ కొన్ని సమస్యల పరిష్కారానికి కమిషనర్ రాసినప్పటికీ సెక్షన్ల వారీగా సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఆయా సెక్షన్లలోనే ఫైళ్లను ఆపివేయడంతో పనులు ఆగిపోతున్నాయనే చర్చ జరిగింది.
ఈక్రమంలో పలువురు ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి తాము ఇచ్చిన దరఖాస్తులను కమిషనర్ ఆమోదించినా సెక్షన్లలో మాత్రం మోక్షం లభించడం లేదని చెప్పారు. అంతేకాకుండా కొన్ని ఫైళ్లు ఆర్జేసీ, డీసీల దగ్గరే ఆగిపోయాయని, తమపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో వాటిని ఆపేశామని ఆయా సెక్షన్ల సిబ్బంది చెప్తున్నారని వారు పేర్కొన్నారు. బొగ్గులకుంటలోని ప్రధాన కార్యాలయంలో సెక్షన్ల వారీగా కమిషనర్ తనిఖీలు చేపట్టి ప్రక్షాళన చేయాలని దేవాలయ అర్చక సిబ్బంది కోరారు. కొన్నేండ్లుగా పాతుకుపోయిన ప్రధాన సెక్షన్లలోని సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల కారణంగా అసలు ఫైళ్లే ముందుకు సాగడం లేదని, వారి చేతులు తడిపితేనే తమ పనులు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.
యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి, కొండగట్టు తదితర ప్రధాన దేవాలయాలకు సంబంధించిన కొన్ని అంశాలపై ధర్మవాణిలో ఆయా ఆలయాల అర్చక సిబ్బంది కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోగా, ఆయా దేవాలయాల ఈవోలకు రిమార్క్స్ కావాలని కమిషనర్ అడిగారు. కానీ, ఇప్పటివరకు దేవాలయాల ఈవోలు ఆ అంశాలపై నివేదిక ఇవ్వకపోగా ఒకవేళ కొన్ని ఇచ్చినప్పటికీ అవి సెక్షన్లలోనే ఆగిపోవడం గమనార్హం. ఈ విషయంపై సదరు ఉద్యోగులు ఆయా సెక్షన్లలో అడిగినప్పటికీ తమపై పని ఒత్తిడి ఉన్నదంటూ తమకు వీలైనప్పుడు చేస్తామంటూ చెప్పారని అర్చక ఉద్యోగులు తెలిపారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే లేఖలపై స్పందించే తీరు చాలా వింతగా కనిపిస్తున్నది. ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్‌తోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయం కూడా స్పందించింది. ఆ ఉద్యోగి తనకు సంబంధించిన అర్హతల ధృవీకరణ పత్రాలు నకిలీవి పెట్టారంటూ చేసిన ఆరోపణలపై ఈ సంవత్సరం జనవరి 22న ఏడీసీ శ్రీనివాసరావు దేవాలయ కార్యనిర్వాహణాధికారికి ఒక లేఖ పంపారు.
ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో పంపాలని, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, ప్రధాన కార్యాలయం నుంచి ఏడీసీ పంపిన లేఖ దేవాలయ ఈవోకు అందలేదు. ఆన్లైన్లో పంపిన వాటిని సైతం మాయం చేసి ఆయనకు అందకుండా చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆలయ ఈవో దామోదర్‌రావును సంప్రదిస్తే తనకు లేఖ అందలేదని చెప్పారు.