సింగరేణిలో కాంగ్రెస్ ముఖ్యనేత బామ్మర్ది బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. తీగలాగితే డొంకంతా కదులుతున్నది. సింగరేణి గనుల టెండర్లలో ‘సైట్ విజిట్’ విధానాన్ని అమల్లోకి తేవడంలో కాంగ్రెస్ ముఖ్యనేత బామ్మర్ది కీలక పాత్ర పోషించినట్టు కార్మిక సంఘాలే చెప్తున్నాయి. ఈ విధానంలో టెండర్ వేసిన సంస్థలు సైట్ మీదికి వచ్చి, ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ కోసం దరఖాస్తు చేసుకుంటే, అడ్రస్ ఆధారంగా ముఖ్యనేత బామ్మర్ది అనుచరులు బెదిరింపులకు దిగి, అక్కడి నుంచి తరిమేశారని స్పష్టంచేస్తున్నాయి. ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడినట్టుగానే బావ అండతో బామ్మర్ది అనుచరులు సింగరేణి కార్పొరేట్ కార్యాలయాన్ని చెరబట్టారని, దౌర్జన్యంగా టెండర్లు దక్కించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సంస్థ పరిధిలోని ఏడు గనులకు చెందిన ఓబీ పనులు, బొగ్గు రవాణా కాంట్రాక్టును సదరు బామ్మర్ది, ఆయన బినామీ కంపెనీలే దక్కించుకోగా ఏడు గనుల్లో కలిపి నెలకు దాదాపు రూ.60 కోట్లకు పైగా వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గోదావరిఖని : సింగరేణిలో ఒకటో.. రెండో గనులను కాదు.. ఏకంగా సింగరేణి వ్యవస్థనే ముఖ్యనేత బామ్మర్ది గుప్పిట్లో పెట్టుకొని దందా నడిపిస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. అక్కడ ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతున్నది. నిబంధనలకు పాతరేసి, కోట్ల రూపాయలు కొల్లగొట్టే జాతరకు సదరు నాయకుడు తెరలేపగా దీనికి గత సీఎండీ, ఓ డైరెక్టర్ అండగా నిలిచినట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధనను అమల్లోకి తెచ్చేలా చక్రం తిప్పిన సదరు ముఖ్యనేత బామ్మర్ది, ఇప్పుడు అదే నిబంధనను అడ్డుపెట్టుకొని తనతోపాటు, తాను అనుకున్న వారికి గనుల బ్లాక్‌లు ఇప్పిస్తూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.. పైగా ముఖ్యనేత పేరును బాహాటంగానే ప్రకటించడంతోపాటు ఆయన పేరు చెప్పి, ఒక్కో కాంట్రాక్టర్‌ను తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలిసింది. నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేసినా.. తనను ఎవడేమీ చేయలేడన్న ధైర్యంతో బెదిరింపులు మరింత పెంచినట్టు సమాచారం.
నైని బ్లాక్ టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భట్టి వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకుడి బామ్మర్ది అక్రమాలపైకి అందరి దృష్టి మళ్లింది. అయితే, ఆయన చేస్తున్న దందాలు, అందుకోసం వ్యూహాత్మకంగా మార్చిన నిబంధనలు, అధికారులను తనకు అనువుగా మార్చుకోవడంపై ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా చర్చ సాగుతున్నది. నిశితంగా చూస్తే.. సింగరేణి గనులను హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే సదరు బామ్మర్ది పక్కా ప్రణాళితో స్కెచ్ వేసినట్టు అర్థమవుతున్నది. అందులోంచి పుట్టుకొచ్చిందే ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన! అందుకోసం గత టెండర్ విధానాలను పక్కనపెట్టి, కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చి, దానిని అడ్డుపెట్టి గనులను చెరపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆధిపత్యం చెలాయిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధ్యయనం లేకుండానే కొత్త క్లాజ్
నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ (ఎన్ఐటీ) నిబంధనల్లో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే క్లాజ్ (నిబంధన)ను కొత్తగా చేర్చి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బామ్మర్ది సింగరేణి మొత్తాన్ని తన కనుసన్నల్లోకి తీసుకున్నారు. 2025 ఏప్రిల్ 21న ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు.
నిజానికి, ఎన్ఐటీలో ఒక క్లాజ్ మార్చాలంటే చాలా అధ్యయనం జరగాలి. ఎన్ఐటీ కింద రెండు రకాల మాన్యువల్స్ ఉంటాయి. అందులో ఒకటి కాంట్రాక్టు మాన్యువల్ కాగా, రెండోది పర్చేజ్ మాన్యువల్. వీటిలో ఏ నిబంధన మార్చాలన్నా, ముందుగా అందుకు గల కారణాలతో ఒక నివేదిక తయారుచేయాలి.
ప్రస్తుతం ఓవర్ బర్డెన్ విషయంలో ఉన్న ఓపెన్ టెండర్ల ద్వారా జరుగుతున్న నష్టమేమిటి? తద్వారా సింగరేణి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది? ఏ సందర్భంలో సమస్యలు వస్తున్నాయి? వాటిని పరిష్కరించడానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలేమిటి? అయినా పరిష్కారం కాలేదా? అనే అంశాలను ముందుగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలి. అలాగే సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ కమిషన్ గైడ్‌లైన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. వీటితో ఒక నివేదిక రూపొందించి, బోర్డు అనుమతితోపాటు సీఎండీ, మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ వంటి శాఖల నుంచి ఆమోదం తీసుకోవాలి. కానీ, ఇవేవీ చేయకుండానే ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ క్లాజ్‌ను ఎన్ఐటీలో చేర్చి, టెండర్లు పిలుస్తూ తమకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారు. దీనివల్ల క్యూబిక్ మీటర్ కాస్టు పెరిగి సింగరేణి భారీగా భవిష్యత్‌లో నష్టపోతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇతర కంపెనీల్లో లేదు
దేశంలో అతిపెద్ద కోలిండియా కంపెనీ టెండర్లలోనూ ఈ నిబంధన లేదు. ‘సైట్ విజిట్’ అనే నిబంధన మాత్రమే ఉన్నది. కానీ, అక్కడ బిడ్డర్ స్వయంగా సైట్ సందర్శించవచ్చు. టెండర్ దాఖలు చేయడానికి కావాల్సిన సమాచారంతోపాటు ఇతర వివరాలు తీసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, టెండర్లో దాఖలు చేసిన ప్రతి బిడ్డర్ బ్లాక్‌ను సందర్శించినా, సందర్శించకపోయినా.. స్వయంగా బ్లాక్‌ను సందర్శించి, అన్నీ పరిశీలించుకొని టెండర్ దాఖలు చేసినట్టుగానే కోలిండియా భావిస్తుంది. ఎక్కడా అధికారులు ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఆ నిబంధనే లేదు. అలాగే కోలిండియా లిమిటెడ్ దాని అనుబంధ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ పరిధిలో బిడ్డర్ స్వీయ ధ్రువీకరణ పత్రం మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ అధికారులు సర్టిఫికెట్ జారీ చేయాల్సిన అవసరం లేదు. గతంలో సింగరేణిలో ఇంచుమించు ఇవే నిబంధనలుండేవి. కానీ, ఇప్పుడు పాత విధానాలకు పాతరేసి, దొరికినంత దోచుకోవడానికి కొత్త విధానాలకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వివాదం.. బెదిరింపులు
నిజానికి, సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో జరిగిన ప్రతి టెండర్లోనూ వివాదాలు, గొడవలు జరిగాయి. అయితే, వీటిని తెరపైకి రాకుండా సదరు నాయకుడు అడ్డుకున్నారు. వారిని బెదిరింపులకు గురిచేసినట్టు కూడా తెలుస్తున్నది. ఒకవేళ మీరు ఎవరైనా విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం వస్తే.. మీ అంతు చూస్తామని, మీ ఇతర కాంట్రాక్టులపై విజిలెన్స్ నిఘా పెట్టించి, డిస్క్వాలిఫై లిస్టులో పెట్టిస్తామని బెదిరించినట్టు తెలిసింది. మరికొంత మంది కాంట్రాక్టర్లకు మరో రకంగా అంటే.. మీరు ఇతర ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకుండా చేస్తామంటూ ధమ్కీ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ టెండర్ల విషయంలో గొడవ అయినట్టు సాక్ష్యాలున్నాయా? అంటూ కొంతమంది అవగాహన లేని వాదనలు వినిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇక్కడ వ్యాపారం అంటే.. కాంట్రాక్టు చేసుకునే సదరు కాంట్రాక్టర్లు, ఒక ప్రభుత్వంలోని కీలక నేత బామ్మర్దిని వ్యతిరేకించే శక్తి ఉండదనే మాట వాస్తవం! అంతేకాదు, ఎవరైనా సైట్ విజిట్‌కు వస్తున్నారంటే.. ముందుగానే అతని వివరాలు అధికారుల ద్వారా సదరు బామ్మర్ది వద్దకు చేరుతాయని తెలుస్తున్నది.
ఆ మేరకు సైట్ విజిట్‌కు వచ్చే బిడ్డర్ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? ఇప్పటివరకు ఎక్కడ పనులు చేశారు? ఎన్ని కోట్ల పనులు చేస్తున్నారు? ప్రస్తుతం ఎక్కడైనా పనులు నడుస్తున్నాయా? తదితర వివరాలు ఉన్నతాధికారుల ద్వారా తెప్పించుకోవడం, ఆపై వాటిని అడ్డుగా చూపి బెదిరింపులకు దిగడంతో చాలామంది వెనుదిరిగినట్టు కొంతమంది కాంట్రాక్టర్ల ద్వారా తెలుస్తున్నది. బామ్మర్ది ఆగడాలు అక్కడితో ఆగలేదు. ఎవరైనా ఇప్పటికే సింగరేణిలో కాంట్రాక్టు చేస్తూ కొత్త బ్లాక్ కోసం వస్తే, అతన్ని ముందుగా పాత బ్లాక్ నడుపుతున్నందుకు ఎంత ఇస్తావో చెప్పాలంటూ బ్లాక్మెయిల్ చేశారన్న విమర్శలొస్తున్నాయి. అయినా ఎవరైనా ఒకరిద్దరు కొంత మొండిగా వెళ్తే.. అధికారుల నుంచి ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ ఇవ్వకుండా అడ్డుపుల్ల వేసినట్టు తెలుస్తున్నది. అంటే మొత్తం సింగరేణి వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి తీసుకొని, మాఫియా నడిపిస్తున్నాడని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే, గనుల టెండర్లలో సింగిల్ టెండర్ దాఖలు చేస్తే అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో.. తనకు సంబంధించిన కొంతమందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇప్పించి, ఎక్కువ ధరను కోట్ చేస్తూ టెండర్లు వేయిస్తున్నట్టు తెలిసింది. వీరికి కావాల్సిన వారికి మాత్రం కొంత తక్కువ రేట్ కోట్‌చేసి టెండర్ నేరుగా వారికి వచ్చేలా చక్రం తిప్పుతున్నారు.
దురుసు ప్రవర్తన
నిజానికి ఒక బ్లాక్ పొందాలనుకుంటే ఓ రాజీమార్గం ఎంచుకోవాలి. లేదా అందరినీ కూర్చోబెట్టి సముదాయించాలి. లేదా టెండర్ వేయొద్దని రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ, సదరు నాయకుడు మాత్రం అందులో ఏ ఒక్కటీ పాటించడం లేదని, ఓ గుండాలా వ్యవహరిస్తున్నాడని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికారయంత్రాంగం కూడా ఆయనకే వత్తాసు పలుకుతుండటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తున్నదని చెబుతున్నా.. పేరు మాత్రం బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. నిజానికి ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అమల్లోకి తేవడం వెనుక ఉన్న మతలబు, అందుకోసం వంతపాడిన అధికారులు, బామ్మర్ది ఆగడాల వంటి అంశాలతోపాటు ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన టెండర్లు, అందులో బొగ్గు దక్కించుకున్న సంస్థలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే.. మొత్తం అవినీతి, అక్రమాలు బహిర్గతం అవుతాయని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
బామ్మర్ది గుప్పిట్లో బొగ్గు గనులు
వివాదాస్పద సైట్ విజిట్ విధానాన్ని అమల్లోకి తేవడంలో బామ్మర్ది కీలక పాత్ర పోషించినట్టు ఒక సింగరేణి కార్మిక సంఘం నేత వివరించారు. ఈ విధానంలో టెండర్ వేసిన సంస్థ కచ్చితంగా సైట్ మీదికి వస్తుందని, సైట్ విజిట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటుందని, ఈ అడ్రస్ ఆధారంగా బామ్మర్ది అనుచరులు బెదిరింపులకు దిగి, అక్కడి నుంచి తరిమి వేశారని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని ఓట్లు రిగ్గింగ్ చేసుకునే తరహాలోనే.. బావ ఇచ్చిన అండతో బామ్మర్ది అనుచరులు సింగరేణి కార్పొరేట్ కార్యాలయాన్ని ఆక్రమించి, టెండర్ రిగ్గింగ్ తరహాలోనే టెండర్లను కైవసం చేసుకుంటున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. ఇలా సింగరేణి పరిధిలోని ఏడు గనుల్లోని ఓబీ పనులు, బొగ్గు రవాణా కాంట్రాక్టును సదరు బామ్మర్ది ఆయన బినామీ కంపెనీలే తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏడు గనుల్లో కలిసి నెలకు వ్యాపారం దాదాపు రూ.60 కోట్లకుపైగా ఉంటుందని చెప్తున్నాయి.
గెస్ట్‌హౌస్ కేంద్రంగా ఓ అధికారి దందాలు
గతంలో సింగరేణిలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ అధికారి రెండేండ్లపాటు హైదరాబాద్‌లోని సింగరేణి సీనియర్ ఆఫీసర్స్ గెస్ట్‌హౌస్‌లోని దాదాపు 2,500 విస్తీర్ణం ఉన్న ఫ్లోర్‌ను రెండేండ్లపాటు ఆక్యుపై చేసి, ఆపై అన్నీ దందాలకు కేరాఫ్‌గా మార్చినట్టు తెలుస్తున్నది. బామ్మర్ది అండదండలు సదరు అధికారికి పుష్కలంగా ఉండటంతో ఆయన యథేచ్ఛేగా వాడుకున్నట్టు తెలుస్తున్నది. నిజానికి, గతంలో ఈ ఫ్లోర్‌ను సీనియర్ డైరెక్టర్లకు ఇచ్చేవారు. కానీ, ఈ అధికారి మాత్రం తనకు అధికారిక భవనం ఉన్నా.. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన కార్యకలాపాలన్నీ ఇక్కడే జరిగినట్టు తెలుస్తున్నది. గతంలో ఏ ఉన్నతాధికారి కూడా దాదాపు రెండేండ్లపాటు నిర్విరామంగా గెస్ట్‌హౌస్‌ను, అందులో ఏకంగా ఫ్లోర్‌ను వాడుకున్న దాఖలాలు లేవని తెలుస్తున్నది.
దీనికి నెలకు రూ.మూడు లక్షల వరకు ఖర్చు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అంటే ఆయన కావాల్సిన కార్యక్రమాలు చక్కదిద్దుకోవడానికి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. అందులోకి ఎవరికి పడితే వారికి ప్రవేశం లేదు. సదరు అధికారి అనుమతి ఉండాలి? లేదా బామ్మర్ది నుంచి ఆదేశమైనా ఉండాలని తెలిసింది. మొత్తానికి గెస్ట్‌హౌస్‌ను సదరు అధికారి బేరసారాలు, బెదిరింపులకు నిలయంగా మార్చి.. తమ కార్యకలాపాలు సాగించినట్టు కార్మికవర్గాల ద్వారా అందుతున్న సమాచారం.ఒకసారి రెండేండ్ల చరిత్ర చూసినా.. వీడియో ఫుటేజీ చూసినా ఆ గెస్ట్‌హౌస్‌కు, అందులోనూ సదరు అధికారి వద్దకు వచ్చిన కాంట్రాక్టర్లు, అక్కడ జరిగిన బాగోతాలన్నీ బయటకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బామ్మర్ది చెప్పినట్టు సదరు అధికారి పనులు చక్కబెట్టడంతో సదరు అధికారిని తాను నిర్వర్తించే పదవితోపాటు అదనంగా ఫైనాన్స్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ అఫీసర్‌గా కొన్నాళ్లపాటు కొనసాగించారు. ఈ మూడు పదవులు సింగరేణిలో అత్యంత కీలకం కాబట్టి, ఒకే అధికారి వద్ద పెట్టి, వారికి అనుకూలంగా మార్చుకొని అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెరవెనుక పెద్ద తతంగం
నిజానికి ఎన్ఐటీలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన చేర్చడానికి ఆ సమయంలో ఉన్న ఓ డైరెక్టర్ నిరాకరించినట్టు తెలుస్తున్నది. అది మంచి పద్ధతి కాదని, తద్వారా ఓపెన్ టెండర్లకు కూడా ఇబ్బంది అవుతుందని, కొంతమంది బిడ్డర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తే అదనపు ధరలు వేస్తారని, తద్వారా సింగరేణి భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పేర్కొంటూ అడ్డుపడినట్టు తెలిసింది. అయితే, తమ పంతాన్ని ఎలాగైనా సరే నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో రాజకీయ కుట్రలకు పూనుకొని, ఆ డైరెక్టర్‌ను స్వచ్ఛంద పదవీ విరమణపై పంపించారన్న విమర్శలున్నాయి. ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఓ డైరెక్టర్‌ను పెట్టుకొని, ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన చేర్చినట్టు తెలుస్తున్నది. దీనికి అప్పటి సీఎండీ సైతం ‘సై’ అన్నట్టు విశ్వసనీయ సమాచారం. సింగరేణి గనులను కొల్లగొట్టాలన్న ఆలోచన మేరకే ఆ నిబంధనను అమల్లోకి తెచ్చినట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తున్నది. దాదాపు ఇప్పటికే ఏడు బ్లాక్‌లకు ఈ నిబంధన వర్తింపజేసి, బామ్మర్ది అనుకున్న వ్యక్తులకు కట్టబెట్టినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.