Congress Party | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం పుట్టినట్టు తెలుస్తున్నది. రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తూ.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తుతెలియని ప్రదేశంలో రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఉపకులాలకు చెందినవారిని కాకుండా అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఈ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని వారు మీటింగ్‌లో నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఈ భేటీ జరిగినట్టు తెలిసింది. జుకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ భేటీకి హజరైనట్టు సమాచారం. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వివిధ కారణాలతో హాజరుకాలేదని, కానీ వారి సమ్మతితోనే సమావేశం జరిగినట్టు తెలిసింది. వీరందరూ తమ సామాజికవర్గానికి మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు లేఖ రాశారు. ఆ లేఖ మీద ఒక్క కాలె యాదయ్య మినహా అందరూ సంతకాలు చేసినట్టు తెలిసింది.
మీనాక్షితో భేటీ!
తెలంగాణలో మాదిగ ఓటర్లు 47 లక్షలమంది ఉన్నారని, వీరంతా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి మద్దతుగా ఉండి అధికారంలోకి తీసుకొచ్చారని, అయినా.. తమకు క్యాబినెట్లో స్థానం దకలేదని మాదిగ సామాజికవర్గపు ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలిసింది. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నది మాదిగ నేత కాదని, మాదిగ ఉపకులానికి చెందిన వ్యక్తి అని వీరు వాదిస్తున్నట్టు సమాచారం. త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గానికి స్థానం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో ఫోన్లో మాట్లాడి, తమ డిమాండ్లను వినిపించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై మరింత చర్చించేందుకు ఢిల్లీకి వచ్చి స్వయంగా కలవాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్టు సమాచారం. కాగా ఈ రహస్య భేటీకి సంబంధించి ఎటువంటి ఫొటోలు విడుదల కాకపోగా.. హాజరైన ఎమ్మెల్యేలు సైతం ఎటువంటి వివరణ ఇవ్వలేదు.