హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తనను అవినీతిపరునిగా జనం ముందు నిలబెట్టిన ముఖ్యనేత మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసితో ఉన్నారా? నైని బొగ్గు గనుల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారా? ‘ఎంతకైతే అంతకాయే’ అనే రీతిలో తెగబడుతున్నారా? బామ్మర్ది గుప్పిట్లో ఉన్న సింగరేణి గట్టును తవ్వి తీస్తున్నారా? అంటే శుక్రవారం భట్టి విక్రమార్క అధికారిక నివాసంలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సింగరేణిలో ఏం జరిగిందో.. ఓపెన్ కాస్టు గనుల ఓబీ టెండర్లు, కోల్ ట్రాన్స్‌పోర్టు బిడ్లు, జిలెటిన్‌స్టిక్స్ కాంట్రాక్టు తదితర అంశాలను తవ్వి తీస్తున్నట్టు తెలిసింది.
శుక్రవారం భట్టి అధికారిక నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారిక పర్యటనలు, అపాయింట్మెంట్లు రద్దు చేసుకున్న భట్టి విక్రమార్క.. సింగరేణి అత్యున్నతాధికారులతో రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ భేటీకి సింగరేణి మాజీ సీఎండీ బలరాంనాయక్ రావడం, ఆయనతో దాదాపు ఆరు గంటలపాటు ఏకాంతంగా చర్చించడంతో కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. తొలుత నైని బొగ్గు గనుల వ్యవహారంపై కేంద్ర మంత్రిత్వ శాఖ వేసిన సాంకేతిక కమిటీ సభ్యులతో భట్టి సమావేశమైనట్టు తెలిసింది. వారు వెళ్లిపోగానే సింగరేణి మాజీ సీఎండీ కొన్ని ఫైళ్లు తీసుకొని భట్టి అధికారిక నివాసం ప్రజాభవన్‌కు వచ్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరే దాదాపు ఆరు గంటలపాటు ఏకాంతంగా చర్చించినట్టు తెలిసింది. మధ్యాహ్నం సింగరేణి ప్రస్తుత సీఎండీ కృష్ణభాస్కర్ ఫైళ్లు పట్టుకొని వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణిలో పర్యటించనున్న నేపథ్యంలో ఫైళ్లతో కుస్తీ పట్టారని బయటికి ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిని మళ్లించేందుకే భట్టి వర్గీయులు వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 4 నెలలకే బామ్మర్ది పాగా!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ముఖ్యమంత్రి తన బామ్మర్దిని సింగరేణిలోకి చొప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనకు చెందిన కంపెనీ 2024 ఏప్రిల్‌లో కొత్తగూడంలోని వీకే 7 ఓపెన్ కాస్టు ఓబీ పనుల కోసం కన్నేసిన వాళ్లు 2025లో ఓపెన్ కాస్టు పనులు దక్కించుకున్నారని, అప్పుడే సైట్ విజిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు మాజీ సీఎండీ డిప్యూటీ సీఎం భట్టికి వివరించినట్టు తెలిసింది. ఈ విధానంతోనే బిడ్డర్లను భయపెట్టించి టెండర్ ఖరారు చేసుకున్నట్టు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. వీకే 7తో సింగరేణిలో అడుగుపెట్టిన ఆయన బినామీలు, అనుచరులతో కలిసి వరుసగా ఏడు ఓపెన్ కాస్టులో పాగా వేశారని మంత్రికి వివరించినట్టు తెలిసింది. దీంతో ఈ రెండేండ్ల కాలంలో సింగరేణిలో అన్ని పనులకు పిలిచిన టెండర్లు, పెంచిన అంచనాలు తదితర వివరాలన్నింటినీ మంత్రి ముందు పూసగుచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎండీ చెప్పిన వివరాలన్నీ ఆకళింపు చేసుకున్న భట్టి విక్రమార్క.. వాటికి సంబంధించిన ఫైళ్లు తీసుకునిరావాలని ప్రస్తుత సీఎండీని ఆదేశించినట్టు తెలిసింది. మంత్రి ఆదేశాలతో ఆయన పూర్తి ఫైళ్లు తెచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో బామ్మర్ది ప్రమేయం ఉన్న అనధికారిక వ్యవహారాలకు సంబంధించిన అధికారిక ఫైళ్లు మొత్తం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ఢిల్లీ అధిష్ఠానానికి ఫైళ్లు?
కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి సింగరేణి ఎండీగా కొనసాగుతున్న బలరాంనాయక్‌కు ఇటీవలే డిప్యుటేషన్ గడువు ముగిసింది. తన గడువు మరోసారి పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి రిక్వెస్టు పెట్టుకున్నారు. భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి ఇద్దరూ కలిసి కేంద్రంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరిపి గడువు పొడిగింపునకు ఒప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం ఏమి జరిగిందో, ఏమో కానీ సీఎం కార్యాలయం ఆయన పదవీకాలం పొడిగింపు ఫైల్‌ను అటు తిరస్కరించకుండా, ఇటు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. పైగా కేంద్ర ప్రభుత్వమే పొడిగింపును తిరస్కరించిందంటూ లీకులు ఇచ్చారు. ఆంగ్ల పత్రికల్లో రాయించారు. ఫైల్ ఎక్కడ ఉన్నదో దొరక్క ఇబ్బందిపడ్డారు. అదే పనిలో ఫైల్ కోసం వెతకగా.. తెలంగాణ సీఎంవోలోనే ఉన్నట్టు తేలిందని సచివాలయ అధికారులు చెప్తున్నారు. కానీ ఈలోగా ఆయన పదవీకాలం ముగిసిపోవడంతో తిరిగి మాతృ శాఖకు వెళ్లిపోయారు. అప్పటినుంచి మాజీ సీఎండీ ముఖ్యమంత్రి మీద కొంత ఆగ్రహంతో ఉన్నారని, ఆ కోపంతోనే బామ్మర్ది లొసుగులన్నీ భట్టికి వివరించారని, వాటికి సంబంధించిన ఆధారాలను మంత్రి అధికారికంగానే తీసుకొని భద్రపరిచారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఈ ఫైల్‌ను భట్టి విక్రమార్క ఢిల్లీ అధిష్ఠానానికి పంపించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.