Salaar 2| రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ పార్ట్ 2 గురించి దర్శకుడు కీలక అప్డేట్ ఇచ్చారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ సినిమా భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు దర్శకుడు ప్రశాంత్ నీల్ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. సలార్ పార్ట్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్, భారీ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఖాన్సార్ సామ్రాజ్యం నేపథ్యంలో దేవ, వరదరాజ మన్నార్ పాత్రల చుట్టూ నడిచిన కథకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
మొదటి భాగం విడుదలైనప్పుడే చిత్రబృందం రెండో భాగం రానుందని ప్రకటించింది. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ మరో పౌరాణిక చిత్రం చేయబోతున్నారనే వార్తలు రావడంతో, “సలార్ 2” ప్రాజెక్ట్ నిలిచిపోయిందా అనే సందేహాలు సోషల్ మీడియాలో పెరిగాయి. దీంతో అభిమానుల్లో కూడా కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ స్పందిస్తూ ప్రస్తుతం తాను ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న “డ్రాగన్” ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే “సలార్ 2” పనులు ప్రారంభిస్తానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఆగిపోలేదని, కేవలం షెడ్యూల్ కారణంగా కొంత ఆలస్యం మాత్రమే జరుగుతోందని అర్థమవుతోంది.
మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న “ఫౌజీ”, అలాగే స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కొంత వరకు పూర్తయ్యే సమయానికి ప్రశాంత్ నీల్ కూడా తన ప్రస్తుత సినిమా పూర్తి చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2027 చివరి నాటికి “సలార్ 2” సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి భాగంలో కనిపించిన భారీ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను మించి పార్ట్-2ను మరింత పెద్ద స్థాయిలో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే “సలార్ 2″పై ఉన్న అంచనాలు భారీగా ఉండగా, తాజా క్లారిటీతో అభిమానులు మళ్లీ సినిమాపై ఆశలు పెంచుకున్నారు.