హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దాదాపు పూర్తయింది. 100 రోజుల్లోనే 1.6 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు 40 లక్షల మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. అంటే కంటి పరీక్షలు చేసినవారిలో 25 శాతం మందికి దృష్టి లోపం ఉన్నట్టు లెక్క. ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధ పడుతున్నట్టు తేలింది. రాష్ట్రంలో అత్యధికంగా జనగాం జిల్లాలో 34.67 శాతం మందికి చూపు సమస్యలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.రెండో స్థానంలో సిద్దిపేట జిల్లా నిలిచింది. జిల్లాలో 5.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, 33.5 శాతం మందికి కంటి సమస్యలున్నాయి. అతి తక్కువగా కంటి సమస్యలు వెలుగు చూసిన జిల్లాగా సంగారెడ్డి నిలిచింది. 12.57 శాతం మందికే సమస్యలు న్నాయి. అత్యధిక మందికి కంటి పరీక్షలు చేసిన జిల్లా కూడా ఇదే. అతి తక్కువ కంటి సమస్యల్లో నాగర్ కర్నూల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కంటి సమస్యల్లో రాష్ట్ర సగటు 25.01 శాతంగా ఉండగా.. 17 జిల్లాల్లో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ మందికి అద్దాలను పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో రాష్ట్ర సగటు కన్నా తక్కువగా నమోదైంది.