RGUKT | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లోని ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో జీపీఏ ఆధారంగా ఈ వర్సిటీలో సీట్లను భర్తీచేసేవారు. దానిస్థానంలో మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేయాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే సర్కారుకు చేరాయి. ఇక సర్కారు ఆమోదం లాంఛనమే కానున్నది.
ఈ నెలలోనే అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను వర్సిటీ అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అయిన ఈ ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలో చేరిన వారికి పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నారు. గ్రామీణ నిరుపేద, ప్రతిభావంతుల కోసమే ఈ వర్సిటీని ఏర్పాటుచేశారు. అయితే మార్కుల విధానంలో అడ్మిషన్లు కల్పిస్తే సర్కారు బడుల్లోని విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
జీపీఏతోనే అడ్మిషన్లు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి పదో తరగతి మెమోలపై జీపీఏతోపాటు మార్కులను కూడా ముద్రించారు. మొత్తంగా కాకుండా సబ్జెక్టుల వారీగా మొత్తం మార్కులు, సబ్జెక్టుల వారీగా జీపీఏను మాత్రమే ముద్రించారు. గతంలో జీపీఏ ఆధారంగా ఎంపిక చేసేవారు. సర్కారు బడుల్లో చదివిన వారికి అదనంగా నాలుగు పాయింట్లు కలపడంతో కలిసొచ్చేది.
దీంతో అధిక సీట్లను సర్కారు బడుల విద్యార్థులే దక్కించుకునేవారు. గ్రేడింగ్‌లో కాకుండా మార్కుల విధానంలో సీట్లను భర్తీ చేస్తే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే అధిక సీట్లను దక్కించుకునే అవకాశం ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెమోలపై గ్రేడింగ్ ఉన్నా, మార్కులను భర్తీచేయడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. మార్కులు కాకుండా గ్రేడింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
గ్రేడింగ్ విధానంలో ఒక సబ్జెక్టులో 92 నుంచి 100 మార్కులు వచ్చిన వారికి 10 గ్రేడ్ పాయింట్లు ఇస్తున్నారు. అంటే 92 మార్కులొచ్చినా, 100 మార్కులొచ్చినా 10 జీపీఏ కిందే పరిగణించేవారు. సర్కారు స్కూళ్లలో చదివిన విద్యార్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు అదనంగా 0.4 పాయింట్లు కలిపేవారు. ఇప్పుడు మార్కుల విధానంలో 92 మార్కులొచ్చిన వారికి అదనపు మార్కులు కలిపితే 96 మార్కులే వస్తాయి. అదే ప్రైవేట్‌లో 98, 99, 100 మార్కులొచ్చిన వారు అధికంగా ఉంటారు. కనుక వారే సీట్లను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.