e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News ఏది కరోనా? ఏది సీజనల్‌?

ఏది కరోనా? ఏది సీజనల్‌?

 • అవగాహనతో మహమ్మారిని జయించొచ్చు
 • వాతావరణ మార్పులతో పెరుగుతున్న జ్వరాలు
 • కరోనానో.. సీజనల్‌ వ్యాధో తెలియక ఆందోళన
 • అన్ని వయస్సుల వారిలో జలుబు, దగ్గు, జ్వరం
 • అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు

కొన్నాళ్లుగా కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇటీవల లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా 366 జిల్లాల్లో 20వేల మందిని సర్వే చేస్తే, రెండు శాతం మంది మాత్రమే తమ ప్రాంతంలో అందరూ మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. మూడుశాతం మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తున్నారని, 80 శాతానికిపైగా మాస్కులు లేకుండా తిరుగుతున్నారని తేలింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనంతట మనమే ప్రమాదంలో
పడినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకొంటున్న సమయంలోనే ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. మరింత శక్తిమంతంగా మారిన మహమ్మారి మెరుపు వేగంతో ప్రపంచాన్ని కమ్ముకొంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవలే హెచ్చరించింది. మరోవైపు రెండు వారాలుగా వాతావరణం వేగంగా మారుతుండటంతో జలుబు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధులు ముసురుకుంటున్నాయి. దీంతో తుమ్మినా, దగ్గినా గుండె దడదడలాడుతున్నది. పక్కన ఉన్నవారు కూడా అనుమానంగా చూస్తున్నారు. ఇప్పటికీ కరోనాకు, సీజనల్‌ వ్యాధులకు మధ్య తేడాలపై చాలా మందికి అవగాహన లేకపోవటంతో సాధారణ జ్వరం, జలుబు వచ్చినా కరోనా అని భయపడి కుంగిపోతున్నారు. మరికొందరు కరోనా సోకినా సాధారణ జ్వరమనే భ్రమతో ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏది సీజనల్‌ వ్యాధి? ఏది కరోనా? అనేదానిపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

‘సీజనల్‌’ లక్షణాలు

- Advertisement -

వర్షాకాలం, చలికాలంలో జలుబు, జ్వరాలు సర్వ సాధారణం. వాతావరణ మార్పులు, దోమలు, కలుషిత నీరు ఇందుకు ప్రధాన కారణం. వరుస అల్పపీడనాలతో రెండు వారాలుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. దీంతో అన్ని వయసుల వారిలో జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలున్నవారు వారం, పదిరోజులు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నిపుణులు సూచిస్తున్నారు.

 • సీజనల్‌ వ్యాధుల్లో 104 డిగ్రీల వరకు జ్వరం రావొచ్చు. ఇది మూడు నాలుగు రోజుల్లో తగ్గుముఖం పడుతుంది.
 • జలుబుతో ముక్కు కారుతుంది
 • కఫంతో కూడిన దగ్గు వస్తుంది.
 • దగ్గువల్ల మాత్రమే గొంతు నొప్పి వస్తుంది.
 • రుచి, వాసన ఉంటాయి.
 • అరుదుగా వాంతులు అవుతాయి.
 • కొందరికి నిద్ర సరిపోకపోయినా, ముందురోజు ఎక్కువగా శారీరక శ్రమ చేసినా ఒంటినొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అవి ఒక్క రోజులోనే తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

కరోనా లక్షణాలు..

కరోనా సోకినవారికి ప్రాథమికంగా జలుబు, జ్వరం వస్తాయి. సీజనల్‌ వ్యాధులతో పోల్చితే ఇవి కాస్త తేడాగా ఉంటాయి.

సాధారణ లక్షణాలు..

 • మూడునాలుగు రోజులైనా విడువని జ్వరం.
 • జలుబు చేస్తుంది కానీ ముక్కు కారదు. ముక్కులో ఏదో అడ్డం ఉన్నదనే భావన కలుగుతుంది.
 • తీవ్రమైన పొడిదగ్గు
 • ఆయాసం, అలసట ఎక్కువగా ఉండటం.
 • రుచి, వాసన తెలియకపోవడం.
 • గొంతు నొప్పి, తలనొప్పి.
 • వాంతులు, విరేచనాలు.
 • ఒంటి నొప్పులు.
 • డీహైడ్రేషన్‌
 • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
 • కండ్లు ఎర్రబడటం.
 • కొందరికి చర్మంపై దద్దుర్లు.

తీవ్రమైన లక్షణాలు

 • ఊపిరి ఆడకపోవడం.
 • ఆకలి తగ్గిపోవడం.
 • ఛాతీలో నొప్పి.

అరుదైన లక్షణాలు

 • చిరాకు.
 • అయోమయం.
 • స్పృహ తప్పడం.
 • ఆందోళన, ఒత్తిడి.
 • నిద్ర సరిగా పట్టకపోవడం.

జాగ్రత్తలే రక్ష

మాస్కులు, శానిటైజర్‌, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనాను సమర్థంగా ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. మొదటి, రెండోవేవ్‌ సందర్భాల్లో అదే నిజమని తేలింది. కొన్నాళ్లుగా కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఇటీవల లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా 366 జిల్లాల్లో 20వేల మందిని సర్వే చేస్తే, రెండు శాతం మంది మాత్రమే తమ ప్రాంతంలో అందరూ మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. మూడుశాతం మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తున్నారని, 80 శాతానికిపైగా మాస్కులు లేకుండా తిరుగుతున్నారని తేలింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి మాస్కులు, శానిటైజర్‌, వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అవగాహనతోనే ఆరోగ్యం

రెండేండ్ల ముందువరకు జలుబు, జ్వరం వస్తే పెద్దగా ఆందోళన చెందేవారుకాదు. ఇప్పుడు ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనాగా భ్రమించి సొంత చికిత్స చేసుకొంటుండటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కరోనా, సీజనల్‌ వ్యాధుల లక్షణాల మధ్య తేడాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించాలి.
డాక్టర్‌ రఘుకాంత్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement