హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): వరదలు, భారీ వర్షాల్లో బాధితులను రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సంసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిపుణులైన 50మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరదల్లో పౌరుల ప్రాణాలను రక్షించేందుకు నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు.. గోదావరి పరివాహకంలో రెస్క్యూ బోట్లతో అగ్నిమాపకశాఖ మోహరించనుందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర వరద ప్రభావిత జిల్లాల కోసం అత్యవసరమైతే ప్రత్యేక బృందాలను పంపుతామని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్కు ఇండియన్ ఫైర్ రెస్క్యూ సిబ్బందితో శిక్షణ ఇప్పించామని తెలిపారు. నీళ్లలో, వరదల్లో పౌరులను కాపాడటంపై 73 మంది సిబ్బంది ఇటీవల శిక్షణ తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ‘ఆపద మిత్ర’ పేరుతో వలంటీర్లను సిద్ధం చేస్తున్నామని నాగిరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 109 మంది ఆపద మిత్రలకు సిద్ధం చేశామని, త్వరలో అన్ని జిల్లాల్లో వీరి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్లతో శుక్రవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం, కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేయాలని, పోలీస్ ఇతర శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాచోంగ్తు పాల్గొన్నారు.