Fatty Liver | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధస్సు(ఏఐ) సేవలను విస్తృతంగా వాడుకోవాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఇప్పటికే క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన వైద్యారోగ్యశాఖ తాజాగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (ఎన్ఏఎఫ్ఎల్డీ) స్క్రీనింగ్‌కు కూడా ఏఐను వినియోగించుకోవాలని భావిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏఐ ఆధారిత సాధనాల ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని గుర్తించి, దాని తీవ్రతను అంచనా వేసి, వ్యాధి ప్రారంభ దశలను కనుగొననున్నారు.
ఏఐ టూల్‌తో రక్త పరీక్షలు, ఇమేజింగ్ టెస్టులు, ఇతర వైద్య సమాచారాన్ని విశ్లేషించనున్నారు. ఈ స్కాన్‌లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలను గుర్తించి నిపుణులైన వైద్యులకు రిఫర్ చేయనున్నారు. డాక్టర్లు రిపోర్టులను అధ్యయనం చేసి వ్యాధిని నిర్ధారణ చేయనున్నారు. ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ వ్యాధి స్క్రీనింగ్ ప్రతిపాదిత ఫైల్‌ను ప్రస్తుతం వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే ఎన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి.
మద్యం తాగకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి(ఎన్ఏఎఫ్ఎల్డీ) అంటారు.కాలేయ బరువు సాధారణం కంటే 5 నుంచి 10శాతం ఎక్కువ కొవ్వుతో తయారైతే దాన్ని ఫ్యాటీ లివర్ (స్టీటోసిస్) అంటారు. మారుతున్న జీవనశైలితోపాటు జన్యు సిద్ధత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) కారణంగా కాలేయంలో కొవ్వు పెరుగుతుంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే అది కాలేయానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక బరువు లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వారికి దీని కారణంగా హై రిస్క్ ఉంటుంది.