హైదరాబాద్ : వర్షాకాలం నేపథ్యంలో కొనసాగుతున్న రైల్వే ట్రాకుల అభివృద్ధి పనుల వల్ల పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు వెల్లడించారు. తిరుపతి-కట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు ఈ స్టేషన్ల మధ్య రైళ్ల రద్దు కొనసాగుతుందన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కాజీపేట్-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, బల్హార్ష-విజయవాడ, కాజీపేట్-సిరిపూర్టౌన్, బల్హార్ష-కాజీపేట్, సిర్పూర్టౌన్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-వికారాబాద్, నిజామాబాద్-కరీంనగర్ వంటి 20 స్టేషన్లలో రైళ్లను ఈ నెల 31 నుంచి ఆగస్టు 7 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
గుంటూరు డివిజనల్ రైల్వే పరిధిలో గుంటూరు-దోన్, కాచిగూడ- నడికుడి, విజయవాడ-గుంటూరు, మాచర్ల-గుంటూరు, నడికుడి-మాచర్ల వంటి స్టేషన్ల మధ్య పది రైళ్లను కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజనల్ రైల్వే పరిధిలో 14 స్టేషన్లలో కలిపి అంటే విజయవాడ-బిట్రగుంట, చెన్నై-బిట్రగుంట, రాజమండ్రి- విశాఖపట్నం, విజయవాడ-గూడూరు, విజయవాడ-ఒంగోలు వంటి పలు స్టేషన్ల మధ్య 14 రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు .
నగరంలో 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్భన్ ఆధ్వర్యంలో నడిచే ఎంఎంటీఎస్ లోకల్ రైలుకు సంబంధించి మొత్తం 22 సర్వీసులను ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రద్దు చేసినట్లు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఫలక్నుమా, రామచంద్రాపురం-ఫలక్నుమా వంటి స్టేషన్ల మధ్య లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనుల వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.