హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెల 6,7 తేదీల్లో అదనంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతవరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల44.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది.
రాష్ట్రంలో రెండు జిల్లాల్లో 44 డిగ్రీలపైన, 23 జిల్లాల్లో 43 డిగ్రీలపైన, 4 జిల్లాల్లో 41 డిగ్రీలపై, రెండు జిల్లాల్లో40 డిగ్రీలు, మరో రెండు జిల్లాల్లో 39 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఒక వైపు ఎండలు దంచి కొడుతుండగా మరో వైపు ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పలుప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ నెల 6వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.