హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): డిగ్రీ చదువుతున్న విద్యార్థినులను తొక్కడు బిల్ల, ఏడుగుంటల ఆటలు ఆడుకోవాలని కాలేజీ యాజమాన్యం టైంటేబుల్ వేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘనకార్యమే చేసింది ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల సొసైటీ! అంతేకుండా గురుకుల పాఠశాల విద్యార్థులకు ఉండే టైంటేబుల్‌నే గురుకుల డిగ్రీ కాలేజీలకు కూడా నిర్దేశించింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకబిగిన క్లాసులు నిర్వహిస్తూ, మధ్యలో ఒకే ఒక్కసారి వాష్‌రూం వెళ్లడానికి కేవలం రెండంటే రెండు నిమిషాల బ్రేక్‌తో టైంటేబుల్ రూపొందించింది. దీంతో అక్కడ చదువుకోలేక విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. దళిత బాలికలను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 30 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసింది. ఆయా కాలేజీల్లో దాదాపు 840 మంది విద్యార్థినులు చదువుకోవాల్సి ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కారు విధానాల ఫలితంగా చాలా డిగ్రీ కాలేజీల్లో అందులో సగానికి కంటే తక్కువగానే విద్యార్థినులున్నట్టు తెలుస్తున్నది. అందుకు సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన నిర్ణయించిన టైంటేబుల్ షెడ్యూలే ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారు.
ఏకబిగిన 5 గంటలు తరగతులు..2 నిమిషాల వాష్‌రూమ్ బ్రేక్
గురుకుల డిగ్రీ కాలేజీల టైమ్‌టేబుల్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఉదయం 8.45 గంటల వరకు రెగ్యులర్ సిలబస్‌కు సంబంధించి ప్రిపరేటరీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఏకబిగిన 5 గంటలపాటు తరగతులను నిర్వహిస్తున్నారు. మధ్యలో ఉదయం 10.30 గంటల నుంచి ఉదయం 10.32 గంటల వరకు అంటే కేవలం 2 నిమిషాలు వాటర్/వాష్‌రూం బ్రేక్ ఇస్తున్నారు. దీంతో విద్యార్థినుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అనేకమంది ఒత్తిడికి లోనవడంతోపాటు అనారోగ్యాల పాలవుతున్నారు. లంచ్ తరువాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పోటీ పరీక్షలకు కోచింగ్ అని చెప్పినా ప్రత్యేక ఫ్యాకల్టీని నియమించలేదు. ఇక్కడ బ్రేక్ కూడా 2 నిమిషాలే. ఇదిలా ఉంటే ఆ తరువాత 5 గంటల వరకు విద్యార్థినులతో ఏడుగుంటలు, తొక్కుడు బిళ్ల తదితర ఆటలు ఆడించాలని ఆదేశించారు. టైంటేబుల్పై విద్యార్థినులు, లెక్చరర్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
మూసివేత కోసమే సర్కారు కుట్ర..!
కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే నిరుడు ఎస్సీ గురుకుల సొసైటీలో 12కుపైగా ఇంటర్ కాలేజీలను మూసేసింది. అనేక గ్రూపులను కుదించింది. ప్రత్యేక గురుకులాలను, ఒకేషనల్ గురుకులాలను రద్దుచేసింది. తాజాగా గురుకుల డిగ్రీ కాలేజీల మూసివేతకు రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఇష్టారీతిన నిర్ణయాలను తీసుకుంటున్నదని సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పలు కాలేజీలను విలీనం చేసింది. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం.. సాయుధ దళాలకు మార్గదర్శకత్వం వహించేలా, ఉన్నత పౌరురాలుగా తీర్చిదిద్దాలనే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో 2018 సంవత్సరంలో రెసిడెన్షియల్ ఆర్మ్ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ను ఏర్పాటుచేశారు. నాటి నుంచి సంస్థ సాయుధ దళాల కోసం బాలికలకు ఒక సమగ్రమైన, మూడేండ్లపాటు అకాడమిక్, రక్షణకు సంబంధించిన అంశాలపై శిక్షణ అందిస్తున్నది. ఏటా కళాశాలలో చేరిన 150 మంది మహిళా క్యాడెట్లు ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలను అభ్యసించడంతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు సైతం సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భవన యాజమానితో అగ్రిమెంట్ చేసుకోకుండా కాలేజీని అక్కడి నుంచి ఘట్కేసర్ దగ్గర లోని అవుశాపూర్‌కు తరలించింది.
అవగాహనలేని వారికి బాధ్యతలు
డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఒకరిని నియమించాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం 15 ఏండ్ల టీచింగ్ అనుభవం, పీహెచ్డీ, సమర్పించిన రీసెర్చ్ పత్రాలు తదితర అకడమిక్ ఫర్మార్మెన్స్ ఇండెక్స్ పరిశీలించాల్సి ఉంటుంది. ఇదే యూజీసీ గైడ్‌లైన్స్‌నే పాటించాలని అన్ని సొసైటీలకు తెలంగాణ ప్రభుత్వం 2019లో జీవో 15ను విడుదల చేసింది. కానీ, ఎలాంటి అనుభవం లేని వారికే ఏకంగా డిగ్రీ కాలేజీల ఇన్చార్జ్ బాధ్యతలను సొసైటీ అప్పగించడం గమనార్హం. సొసైటీ నిబంధనల మేరకు ప్రిన్సిపాల్‌గా మూడేండ్లు అనుభవం ఉన్న వారినే జాయింట్ సెక్రటరీగా నియమించాలి. ఆ నిబంధనలకు పాతరేసి, సీనియర్లను పక్కనపెట్టి ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘకాలంపాటు పాగావేసిన ఒకరికి జాయింట్ సెక్రటరీగా నియమించారు.