Konda Surekha | నయీంనగర్, జనవరి 26 : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాపాలన సభ జనాలు రాకపోవడంతో ఆలస్యమైంది. మంత్రితోపాటు అధికారులు జనాల రాక కోసం దాదాపు గంట పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమయానికి ప్రజలు లేకపోవడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, కలెక్టర్ ప్రావీణ్య పెంబర్తి పంచాయతీలో, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య సమీపంలో ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంటి వద్ద వేచి చూశారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రజల రాక కోసం సభా స్థలం వద్ద ఉన్నారు. ‘త్వరగా తోలుకురండి.. లేటవుతున్నది’ అంటూ కాంగ్రెస్ శ్రేణులను పురమాయించారు.
కార్యక్రమం నడుస్తున్న క్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దళితులు, నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారని, వారికి ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు సరిపోవని, అదే పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంలో సరిపోతాయని అనడంతో వెంటనే అక్కడే ఉన్న మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీకు కావాలంటే నువ్వు అడుగు.. అంతేగాని మా గురించి ఎందుకు మాట్లాడుతున్నవ్’ అంటూ సీరియస్ అయ్యారు. 56వ డివిజన్లోని పూరుగుట్టకు చెందిన కొందరు మహిళలు తాము మంత్రితో మాట్లాడి తమ సమస్యను చెప్తామని ఎంత బతిమిలాడినా పోలీసులు వినకుండా అడ్డుకున్నారు.
అపరిశుభ్ర వాతావరణంలో సభను ఏర్పాటు చేయడంపై ప్రజలు విసుగెత్తిపోయారు. ‘ఈ కంపు వాసన ఏంది.. కనీసం వాసన రాకుండా చల్లేందుకు బ్లీచింగ్ పౌడర్‌కు కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా?’ అని పలువురు చర్చించుకున్నారు. చాలామంది ప్రజలు వస్తారని భావించి కుర్చీలు తెప్పించిన అధికారులు, అకున్నంత మంది రాకపోవడంతో ఎలా తెచ్చిన కుర్చీలను ఎలానే తీసుకెళ్లారు. కొందరు మహిళా కానిస్టేబుళ్లు లబ్ధిదారుల వెంట తెచ్చుకున్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించడంతో ‘మేము ఎలా కనిపిస్తున్నం’ అంటూ కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.