హైదరాబాద్ : వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆన్లైన్ పద్ధతిలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్, టీఎస్ ఈడీసెట్, టీఎస్ ఐసెట్, టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటించారు.
జూలై 21న లా సెట్ (మూడేళ్ల కోర్సు), జూలై 22న పీజీ ఎల్ సెట్, జూలై 22న లా సెట్ (ఐదేళ్ల కోర్సు) ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. జూలై 26, 27, 28 తేదీల్లో ఎడ్‌సెట్, జూలై 27, 28 తేదీల్లో సెట్, జూలై 29 నుంచి ఆగస్ట్ 1వ తేదీ వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే, విద్యార్హత, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో సంబంధిత సెట్ల కన్వీనర్లు వివరణాత్మక నోటిఫికేషన్లు జారీ చేస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.