
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 6: రైతులను తాగుబోతులు, పనిపాట లేని వారని కించపరిచిన హరియాణకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్‌చందర్ జంగా వ్యాఖ్యల పట్ల ఖమ్మం జిల్లా రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను అవమానపరిచేలా మాట్లాడిన రామ్‌చందర్ తీరుకు నిరసనగా ఖమ్మంలో అతని దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతు వ్యతిరేక బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతులు గత కొద్ది నెలలుగా ఉద్యమిస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. రైతులన్నా, వ్యవసాయమన్నా బీజేపీ నాయకులు ఇష్టంలేదని.. తరచూ వారి మాటల్లో ఈ విషయం స్పష్టమవుతున్నదని ధ్వజమెత్తారు. ఇటీవల లఖీంపూర్‌లో ఓ కేంద్రమంత్రి కొడుకు నలుగురు రైతులను కారుతో తొక్కించి హత్య చేశాడని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యంచెప్పారు. ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు మేరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.