హైదరాబాద్, డిసెంబర్ 4 (స్పెషల్ టాస్క్‌ఫోర్స్, నమస్తే తెలంగాణ): లియో మెరిడియన్ రిసార్ట్స్ వ్యవహారంలో మరో మాయ వెలుగుచూసింది. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమి మీద అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. దీని విలువ రూ.800 కోట్ల పైమాటే. 50 ఏండ్ల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమిపై ‘బిగ్’ పంజా విసురుతున్నారు. ఈ కబ్జా పర్వానికి బిగ్ బ్రదర్స్ ముగ్గుపోస్తే, ఓ మాజీ ఎంపీ, ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడైన సలహాదారు ముందుండి నడిపిస్తున్నారు. రైతులకు చట్టబద్ధంగా, వారసత్వంగా వచ్చిన తాతల నాటి భూమిని ఉత్తి పుణ్యానికి గుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. షాడో హోం మంత్రిగా చెలామణి అవుతున్న నేత కీలక ప్రాతధారి కావటంతో చట్టం కూడా వారికే వత్తాసు పలుకుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొంరాస్‌పేటలో లియో రిసా ర్ట్స్ మాటున జరుగుతున్న హద్దూ అదుపు లేని కబ్జాల పరంపరకు కొనసాగింపు ఇది.
లియో మెరిడియన్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సర్వే నంబర్లలోనే దాసరి చంద్రారెడ్డి, నోముల లక్ష్మయ్యకు చెందిన వ్యవసాయ భూమి ఉన్నది. సర్వేనంబర్లు 414, 430 మీద 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వాళ్లు బతికి ఉన్నన్నినాళ్లు ఇదే భూమిలో వ్యవసాయం చేసుకున్నారు. తదనంతరం ఈ ఆస్తి వారి పిల్లలు దాసరి నర్సింహారెడ్డి, నోముల శ్రీనివాస్‌రెడ్డితోపాటు వారి ఆరుగురు సోదరులకు సంక్రమించింది. భూ పంపకాలు చేసుకొని ఎవరికివారుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం వారికి 38ఈ సెక్షన్ కింద ఆక్యుపెన్సీ హకులను కల్పించింది. 24.09.2019 నాటి ఉత్తర్వు ద్వారా కీసర ఆర్డీవో వారికి పట్టా హక్కులు కల్పిస్తూ పట్టాదార్ పాస్ బుక్‌లు జారీచేశారు. 50 ఏండ్ల నుంచి ఎటువంటి వివాదం లేదు.
2019లో లియో మెరిడియన్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దివాలా కంపెనీగా గుర్తించిన తర్వాత నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) సర్వే నంబర్లు 414, 416, 417, 418, 419, 421, 426, 427,429లోని భూములను వేలానికి పిలిచింది. సర్వే నంబర్లు 414, 430ల్లోని 20 ఎకరాలపై రైతులకు ఆక్యుపెన్సీ హకులు పొందటంతో వేలం నుంచి తొలగిస్తూ మరో నోటిఫికేషన్ వేసింది. బిడ్డర్ల మీటింగ్ మినిట్స్‌లోనూ 13 సర్వే నంబర్లలో ఉన్న 66.28 ఎకరాల భూమినే వేలం వేస్తున్నట్టు, 414, 416 సర్వేనంబర్లలోని 20 ఎకరాల భూమి దాసరి నర్సింహారెడ్డితోపాటు మరో ఏడుగురికి చెందుంతుందని బ్యాంకుల కన్సార్షియం స్పష్టంగా చెప్పింది. పూర్తిగా వ్యక్తిగతమైన ఈ వ్యవసాయ భూమిలో సీఐఆర్‌పీ ఎటువంటి జోక్యం చేసుకోదని కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించారు. ఇదే విషయాన్ని 2024 అక్టోబర్ 7 వ తేదీన జరిగిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ సమావేశంలోనూ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, వ్యాపారవేత్త ఓ బినామీ వ్యక్తితో బిడ్డింగ్ వేయించి, పెద్దలతో మత్రాంగం చేసి, రూ.వేల కోట్ల విలువైన లియో మెరిడియన్ ఆస్తులను నామమాత్రపు ధరకు దక్కించున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 66.28 ఎకరాలు తమ చేతిలో పడగానే ముఖ్యనేత సలహాదారు, మాజీ ఎంపీ కలిసి మొత్తం 143.13 ఎకరాల భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్న విషయం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. వారికి అదీ సరిపోక, దానిని ఆనుకొని ఉన్న సామాన్య రైతులకు చెందిన 20 ఎకరాల భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ పంపిన రౌడీలు వ్యవసాయ పొలంలోకి ప్రవేశించి పంటను ధ్వంసం చేశారని, తాము వ్యవసాయ పనులు చేసుకోకుండా అడ్డం పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం తాము పంటలు వేసుకుంటే రాత్రి వేళ వచ్చి ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. భూమి చుట్టూ ఏర్పాటు చేసిన పెన్సింగ్‌ను తొలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గత నెల 25న గేట్ల తాళాలను పగలగొట్టి అక్రమంగా భూమిలోకి వచ్చారని, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని బాధితులు వాపోతున్నారు. ఈ దౌర్జన్యకాండపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపైనే ఉల్టా కేసులు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు స్పష్టం గా పోలీసులను ఆదేశించిందని తెలిపారు. అయినా పోలీసులు షాడో హోం మంత్రి మాటలనే తు.చ తప్పకుండా వింటున్నారే తప్ప, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కోర్టు ఆదేశాలను పాటించాలని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
మా భూముల్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులతోపాటు, దీని వెనుక ఉన్న పెద్దల పేర్లతో పోలీసులకు ఫిర్యాదుచేశాం. కానీ పోలీసులు పెద్దల పేర్లు పెట్టకుండా ఎఫ్ఐఆర్ చేశారు. అందుకే కోర్టుకు వెళ్లాం. మా వద్ద ఉన్న ఆధారాలను తీసుకొని, సమగ్ర దర్యాఫ్తు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసుల తీరులో మార్పు లేదు. పట్టాదారులమైన మాకు కనీస సమాచారం ఇవ్వకుండా సర్వే చేయబోయారు. మా సోదరులం అంతా కలిసి సర్వే అడ్డుకున్నాం.
-దాసరి సుధాకర్‌రెడ్డి, రైతు
రాఘవ అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్, డీసీపీ పేరు చెప్పి అక్రమంగా మా భూమిలోకి వచ్చి సర్వే చేయించారు. కనీసం మాకు నోటీసులు కూడా లేకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులు, సర్వేయర్ కలిసి వచ్చి మా భూమికి హద్దులు పెట్టే ప్రయత్నం చేశారు. డీపీసీ వద్దకు పోతే ఒక మాజీ ఎంపీ పేరు చెప్పి, ఆయనతో మాట్లాడుకోవాలని సలహా ఇస్తున్నారు. కోర్టు ఆదేశాలతో రౌడీల మీద ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఇప్పటివరకు తదుపరి చర్యలు లేవు.
-దాసరి కృష్ణారెడ్డి, రైతు
ఎల్ఐఐపీహెచ్ఎల్ మేనేజ్మెంట్ (లియో రిసార్ట్స్) మాపై దాడి చేయిస్తున్నది. మేం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదుచేశాం. అయినా ఆగడం లేదు. మా భూముల్లోకి అక్రమంగా పదేపదే ప్రవేశిస్తున్న వ్యక్తులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంటున్నాం. నేరాలకు అలవాటుపడిన వ్యక్తులను మా కుటుంబంపైకి ఉసిగొల్పుతున్నారు. వారితో మాకు ప్రాణభయం ఉన్నది. వారి నుంచి మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాం.
-నోముల మధుసూదన్‌రెడ్డి, రైతు