హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి పేర్లను గవర్నర్ నామినేట్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను బుధవారం రద్దు చేసింది. నిరుడు ఆగస్టులో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను రద్దు చేస్తూ నిరుడు మార్చిలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా, ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 14న స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ ఆదేశాల్లో పొరబాటు జరిగిందని ధర్మాసనం గుర్తించి, బుధవారం స్టే ఆదేశాలను సవరించింది. దీంతో హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చినట్టయ్యింది. ఫలితంగా ఇద్దరి పదవులు రద్దయినట్టేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తదుపరి విచారణను ధర్మాసనం సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.
గతంలోనే రద్దు చేసిన హైకోర్టు
2023 జూలైలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను నిర్ణయించి, అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఫారసు చేశారు. అయితే రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్నదని, రాజ్యాంగ ఆర్టికల్ 171(5)లో పేర్కొన్న రంగాల్లో ప్రతిభ లేదని పేర్కొంటూ ఇద్దరి నామినేషన్లను గవర్నర్ తిరస్కరించారు. 2024 జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఉర్దూ పత్రిక సంపాదకుడు అమీర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. వాటిని గవర్నర్ ఆమోదించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమంటూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సమగ్రంగా విచారణ జరిపి 2024 మార్చి 7న కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించడాన్ని రద్దు చేసింది. కొత్త నామినేషన్లను కూడా రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం మరోసారి కోదండరాం, అలీఖాన్ పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేయగా, ఆయన ఆమోదించారు. ఆ తర్వాత వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు.
మధ్యంతర ఉత్తర్వుల్లో పొరపాటు
గవర్నర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నదని పేర్కొంటూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ కార్యాలయం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నిరుడు ఆగస్టు 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతోపాటు తామిచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఎమ్మెల్సీల నియామకం ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తుది తీర్పు వెలువరించకముందే కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడాన్ని తప్పుపట్టింది. నియామకాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, తుదితీర్పు వచ్చేవరకు మరోసారి నియామక ప్రక్రియ చేపట్టవద్దనే ఉద్దేశంతో మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసినట్టు తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించడం తాము చేసిన పొరపాటు అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీని ఆధారంగా ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారని, ఇప్పటివరకు ప్రయోజనం పొందారని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తాము మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తున్నట్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై తాము విధించిన స్టేను ఎత్తివేస్తున్నట్టు పేర్కొన్నది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కోదండరాం, అమీర్ అలీఖాన్ సవాల్ చేయలేదని గుర్తుచేసింది.
అప్పుడు ఖాళీలు ఏర్పడలేదా?
ప్రతివాది తరఫు న్యాయవాది కల్పించుకుని కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను రద్దు చేస్తే మండలిలో ఖాళీలు ఏర్పడతాయని వాదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరించినప్పుడు ఖాళీలు ఏర్పడలేదా? అని ప్రశ్నించింది. కావాలంటే ఇప్పుడు మరోసారి నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచించింది.
అయితే ఈ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టంచేసింది.
గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు
దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని చెప్పి ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించారని.. మళ్లీ రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న కోదండరాం, జర్నలిస్ట్ అలీఖాన్ పేర్లను ఆమోదించారని చెప్పారు. మంత్రివర్గం సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించాలని, ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వాన్ని వివరణ కోరాలన్న నిబంధనను అమలు చేయలేదని వాదించారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్నయం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ కారాదన్నారు. వ్యక్తిగతంగా పిటిషనర్ల ప్రయోజనాల కోసం కాదని, వ్యవస్థలో ప్రధానంగా రాజ్యాంగ పదవుల్లోని పెద్దల నిర్ణయాలు ముఖ్యమన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారని, ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్నట్టుగా తయారైందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం నిరుడు ఆగస్టు 14న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండే అన్ని చర్యలను రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ శాసనమండలి సమావేశాలకు హాజరు కాకూడదని రంజిత్‌కుమార్ వాదించారు.
నిబంధనలకు లోబడే గవర్నర్ సిఫారసు
గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగానే గవర్నర్ చట్టప్రకారం ఆ పేర్లకు ఆమోదం తెలిపారన్నారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించారని, గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి లోబడి పనిచేశారన్నారు. ప్రతివాదులైన కోదండరాం, అలీఖాన్‌ల తరఫున న్యాయవాదులు నిషాంత్శర్మ, రామకృష్ణారెడ్డి వాదించారు.
ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీయేనా?
దాసోజు, సత్యనారాయణ పేర్లను నామినేట్ చేయడానికి గవర్నర్ తిరస్కరించడం చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే సవరించడం కీలక పరిణామంగా న్యాయనిపుణులు అభివర్ణిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం స్టే రద్దు చేయడంతో కోదండరాం, అలీఖాన్‌లు ఎమ్మెల్సీ పదవులు రద్దు అయినట్లేనని వారంటున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నిరుడు ఆగస్టు 14న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బుధవారం సవరించడంతో.. న్యాయపరంగా ఆ ఇద్దరి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అయినట్టేనని చెప్తున్నారు. హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చినట్లేనని.. దీనికితోడు హైకోర్టు తీర్పుపై కోదండరాం, అలీఖాన్‌లు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడంగానీ, ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు పొందడం గానీ చేయలేదన్నది కీలక విషయంగా పేర్కొంటున్నారు. దీనివల్ల హైకోర్టు తీర్పు అమల్లోకి వస్తుందని, ఫలితంగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినట్టుగా భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఏమైనా ప్రయత్నాలు జరిగితే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో షరతు విధించిందని కూడా చెబుతున్నారు.