హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి 2022 లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పకన పెట్టారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్‌సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. 170(3) అధికరణం పునర్విభజనకు సంబంధించిన అంశాలను స్వీకరించడంలో రాజ్యాంగపరమైన అడ్డంకిగా పనిచేస్తున్నదని ధర్మాసనం తెలిపింది.
ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాల్లో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉన్నాయని తెలిపింది. జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉన్నదని పేర్కొన్నది. 2026 తర్వాత మొదటి జనగణన అనంతరమే డీలిమిటేషన్ నిర్వహించబడుతుందని చట్టంలో స్పష్టంగా చెప్పారని వెల్లడించింది. జమ్మూకశ్మీర్ కోసం జారీచేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, టీజీలను మినహాయించడం ఏకపక్షం, వివక్షత కాదని స్పష్టం చేసింది.
భారత ప్రభుత్వం 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను పార్లమెంటులో Subject to అనే పదాన్ని NOT WITH STANDING తో సవరించి ఉంటే ఏపీ, టీజీ రాష్ట్ర శాసనసభలలో సీట్లు పెరిగేవని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ 2014-2019 లో ప్రధాని దృష్టికి ఈ సవరణ చేయాలని విన్నవించినా సెక్షన్ 26ని సవరించడానికి కేంద్రం చర్యలు తీసుకోలేదని తెలిపారు. సవరించడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లును 2015లో ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు. 2026 జనాభా లెకల తర్వాతే డీలిమిటేషన్ ప్రారంభించబడుతుందని సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. సెక్షన్ 26ని సవరించినట్లయే చాలాకాలం క్రితమే సీట్లు పెరిగేవని అభిప్రాయపడ్డారు.