హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికిగానూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి సీట్ల భర్తీ పూర్తయింది. టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 23న టీజీసెట్ నిర్వహించగా, మూడు దఫాలుగా సీట్ల భర్తీని చేపట్టినట్టు వివరించారు. మిగిలిన 1,822 సీట్లకు తుది మెరిట్ జాబితాను శనివారం విడుదల చేసినట్టు వెల్లడించారు.
అడ్మిషన్ల అనంతరం సీట్లు ఖాళీగా ఉంటే వాటిని 25వ తేదీ తర్వాత భర్తీ చేస్తామని తెలిపారు. ఇంటర్లో అడ్మిషన్‌కు అర్హత పొందిన విద్యార్థుల జాబితాను 23వ తేదీలోగా వెల్లడిస్తామని వివరించారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను వెల్లడించారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను 1:10 చొప్పున ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లకు ఎంపిక చేయగా, మొత్తం 80 సీట్లకు 102 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మలాజ్‌గిరి జిల్లా ఏదులాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు అర్హత సాధించిన 85 మంది విద్యార్థుల జాబితాను కూడా సొసైటీ ప్రకటించింది.