హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ఇటీవల కల్పించిన ప్రమోషన్లను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శుక్రవారం నిర్వహించనున్న కౌన్సెలింగ్ తేదీలనూ వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీ గురుకుల సొసైటీలో 23మంది గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సొసైటీ ఇన్చార్జి సెక్రటరీ ఇటీవల ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన ప్రిన్సిపాళ్లకు 5వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రమోషన్లపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రమోషన్ల ప్రక్రియను క్రమానుగతంగా చేపట్టకపోవడాన్ని నిలదీశాయి. వాస్తవంగా సొసైటీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ 2(ఏడీ), జాయింట్ సెక్రటరీ (జేఎస్) 5, డిప్యూటీ సెక్రటరీ 6 (డీఎస్), అసిస్టెంట్ సెక్రటరీ 5 పోస్టులు, అవిగాకుండా మల్టీ జోన్1, మల్టీజోన్2, జోనల్ ఆఫీసర్ల పోస్టులున్నాయి.
2017 సొసైటీ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం.. ఆయా విభాగాల్లో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ల ద్వారా, మరికొన్నింటినీ(అకౌంట్స్) డిప్యుటేషన్‌పై భర్తీ చేయాలి. ప్రస్తుతం సొసైటీలో అకాడమిక్‌కు సంబంధించి జేఎస్(జాయింట్ సెక్రటరీ), డీఎస్‌లు (డిప్యూటీ సెక్రటరీ)లు, మల్టీజోన్ 2, జోనల్ 1, 2, 6, 7 ఆఫీసర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎగువస్థాయిలో ఆయా పోస్టులను భర్తీ చేయకముందే దిగువ పోస్టుల భర్తీని సొసైటీ చేపట్టడడమే చర్చనీయాంశంగా మారింది. కేవలం గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు మాత్రమే ప్రమోషన్లు కల్పిస్తూ రాత్రికి రాత్రి ఉత్తర్వులివ్వడంలో ఆంతర్యమేంటని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక అవినీతి దాగి ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రమోషన్ల కౌన్సిలింగ్ నిర్వహణను వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ప్రమోషన్ల ప్రక్రియ చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వైద్యుల బదిలీలు నిబంధనలకు అనుగుణంగా జరుగడం లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి మండిపడ్డారు. స్పౌస్ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. బదిలీల్లో జీవో-38 అమలు జరుగకపోతే టీజీజీడీఏ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని, అవసరమైతే వైద్యసేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.