హైదరాబాద్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణకు క్రీమీలేయర్‌ను అమలుచేయవద్దని, 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా కులగణన చేపట్టాలని ఎస్సీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును అధ్యయనం చేసేందుకు, అమలుకోసం చేయాల్సిన సిఫారసులపై మంత్రి ఉత్తమ్ చైర్మన్‌గా ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ సమావేశమై రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రజాసంఘాల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆన్లైన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1850కి పైగా, ఆఫ్‌లైన్ ద్వారా 60కి పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.
ఇప్పటివరకు వచ్చిన విజ్ఞప్తుల్లో చాలావరకు ఎస్సీ కులాల వర్గీకరణ శాస్త్రీయంగా కొనసాగించాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. మాదిగ, మాలతోపాటు ఎస్సీ ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీకి, లేదంటే ఏకసభ్య కమిషన్ పరిశీలనకు పంపించేందుకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.