చందుర్తి, డిసెంబర్ 12 : రాయితీ బర్రెల కోసం ఆశించిన అన్నదాతకు నిరాశే ఎదురైంది. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. 2020-21లో బీఆర్ఎస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద రెండు బర్రెలు రాయితీపై ఇచ్చేందుకు అర్హులను ఎంపిక చేసింది. ఈ క్రమంలో సిరిసిల్ల ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఈ నెల 8న చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులను హర్యానాలోని రోహ్తక్ జిల్లా పురాణ డైయిర్ ఫాంకు తీసుకెళ్లారు. మొదట ఎనిమిది నెలల సూడి బర్రెలు ఇస్తామని చెప్పి, అకడికి వెళ్లాక ప్లేట్ ఫిరాయించారు.
నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు సూడితో ఉన్న బర్రెలు మాత్రమే ఇస్తానని అకడి ఫామ్ నిర్వాహకులు చెప్పడంతో రైతులు నిర్ఘాంతపోయారు. నాలుగు రోజులుగా అకడి ఫామ్ల చుట్టూ తింపిన అధికారులు చివరకు రిక్తహస్తం చూపారు. ఎనిమిది నెలల పైబడిన సూడి బర్రెలు ఇస్తేనే తీసుకుంటామని రైతులు స్పష్టంచేశారు. ప్రారంభంలో ఒకటి చెప్పి హర్యానాకు వచ్చాక మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బర్రెలు తీసుకోకుండానే గురువారం రోహ్తకు నుంచి తిరిగి ప్రయాణమయ్యారు.