హైదరాబాద్ (ఖైరతాబాద్) ఆగస్టు 12: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాల ప్రజాప్రతినిధులపై విషంకక్కుతున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య ఆరోపించారు. హైదరాబాద్లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగల్లో అక్షరాస్యత లేని, అభివృద్ధి చెందని కుటుంబాలకు సమాన అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వర్గీకరణ అనే ది చివరకు రిజర్వేషన్ల రద్దుకే దారి తీస్తుందని తెలిపారు. బీజేపీ, ఏపీ సీఎం చంద్రబాబు మత్తులో నుంచి మందకృష్ణ బయటకు వచ్చి దళితుల ఐక్యతకు కృషి చేయాలన్నారు. వర్గీకరణను అడ్డుకొని తీరుతామని, సుప్రీం కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా త్వరలోనే జాతీయస్థాయిలో ఆందోళనలు చేపడుతామని వెల్లడించారు.
సుప్రీం తీర్పు ఏ కులానికీ వ్యతిరేకం కాదు
హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ కులానికీ వ్యతిరేకం కాదని మాదిగ మేధావుల ఫోరం అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ తీర్పులో సామాజిక న్యాయం కనిపిస్తున్నదని చెప్పారు. ఎస్సీల్లోని అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు రావాలనే అంబేదర్, ఫూలే కోరుకున్నారని వెల్లడించారు. సుప్రీం తీర్పులో కూడా ఇదే విషయం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు ఎస్సీల్లోని అన్నికులాల మేధావులందరూ కలిసి చర్చించుకుని, ఇప్పటి వరకు అవకాశాలు రాని వారికి అవకాశాలు రావడానికి ఏం చేయాలో ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉన్నదని సూచించారు. 15 శాతమున్న రిజర్వేషన్ను 20 శాతానికి పెంచుకోవడానికి కలిసి పోరాడుదామని కోరారు.