హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా నలిగిపోయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో కీలక ఘట్టానికి చేరుకుంది. నిరుడు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం ఐదు బిల్లులు ప్రవేశపెట్టగా మూడు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోందించింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ చేసిన సవరణ బిల్లు ఉన్నాయి. ఇక దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఉండగా సభవాయిదా పడటంతో నేడు సభ ముందుకు రానున్నాయి.
చిరకాలస్వప్నం.. సుప్రీంకోర్టు తీర్పుతో సాకారం!
ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. ఆ కోటాలో మాలలే ఎకువగా లబ్ధిపొందుతున్నారనే చర్చ 1970 దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది. వాస్తవంగా జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎకువైయినప్పటికీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తకువ స్థాయిలో ఉన్నారనేది వర్గీకరణ ఉద్యమానికి మూలం. తమకు అన్యాయం జరుగుతున్నదని మాదిగల పోరాటంతో ఎట్టకేలకే ఈ అంశంపై 1995లో ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించింది. మాదిగల వాదన నిజమేనని సమర్థిస్తూ ఆ కమిషన్ 1996లో తన నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997 జూన్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా వర్గీకరిస్తూ జీవో విడుదల చేసింది. 2000లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా, రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చింది. 2004లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో చట్టానికి చుకెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. నాటి నుంచి ఈ పంచాయితీ పెండింగ్ ఉన్నది.