మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ
గ్రూప్-1 15 కులాలు : 1%
బావూరి, బేడా (బుడ్గ) జంగం, చచాటి, డక్కల్- డొక్కల్వార్, జగ్గలి, కొలుపులవాండ్లు-పంబాడ-పంబండ-పంబాలా, మాంగ్, మాంగ్ గరోడి, మన్నే, ముష్తీ, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు.
గ్రూప్-2 18 కులాలు : 9%
అరుంధతీయ, బండ్ల, చమర్- మోచి- ముచి- చమర్-రవిదాస్, చమర్-రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్- డోంబారా- పైడి- పానో, ఎల్లమ్మల్వార్- ఎల్లమ్మలవాండ్లు, గోడారి, జాంబువులు, మాదిగ, మాదిగదాసు- మష్తీన్, పామిడి, పంచమ- పరియ, సమగర, సిందోళ్లు (చిందోళ్లు), యాటల, వల్లువన్.
గ్రూప్-3 26 కులాలు : 5%
ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆనాముక్, ఆరె మాల, ఆర్వ మాల, బారికి, బ్యాగరి, చలవాడి, డోర్, ఘాసి, హడ్డి, రెల్లి, దాచండి, గోసంగి, హోలేయా, హోలేయ దాసరి, మాదాసి కురువ, మాదరి కురువ, మహర్, మాల, మాల అయ్యవార్, మాల దాసరి, మాలదాసు, మాల హన్నయ్, మాలజంగం, మాల మస్తీ, మాలసాలె, నేతకాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటీ, తోటి, రెల్లి.
SC Classification | హైదరాబాద్, ఫిబ్రవరి4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల వర్గీకరణ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీల వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీకరణ ప్రక్రియను చేపడతామని పేర్కొన్న సర్కారు పాత లెక్కలపైనే ఆధారపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల ఇంటింటి సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఆ వివరాలను మంగళవారం అసెంబ్లీలో వెల్లడించినప్పటికీ ఎస్సీల వర్గీకరణకు మాత్రం ఆ గణాంకాలను పరిగణించకపోవడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించాలన్న ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దళిత సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఎస్సీలను వర్గీకరించేందుకు తగు సిఫారసులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య జ్యూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్ క్యాబినెట్ సబ్‌కమిటీకి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో సేకరించిన జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా 52,17,684 మందిగా కమిషన్ నిర్ధారించింది. రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల్లో 59 ఉప కులాలను గుర్తించిన కమిషన్ వాటిని మూడు గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు అమలు చేస్తున్న 15 శాతం రిజర్వేషన్లను ఆ మూడు గ్రూపులకు విభజించింది. ఈ నివేదికపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకొని వర్గీకరణను అమలు చేయాలని, కానీ అందుకు విరుద్ధంగా 2011 నాటి లెక్కలను పరిగణించడమేమిటని దళితసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అనేక ఎస్సీ కులాలు ప్రస్తుతం తెలంగాణలో లేవని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. అదీగాక రూ.160 కోట్లు ఖర్చుపెట్టి, శాస్త్రీయపద్ధతిలో ఇంటింటి సర్వే చేశామని చెప్తున్న ప్రభుత్వం ఆ లెక్కలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. విద్య, ఉపాధి, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయకుండా రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయడం వల్ల నష్టమే తప్ప మెజార్టీ ఎస్సీ కులాలకు ఒనగూరేది ఏమీ ఉండబోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రభుత్వం ఆమోదించిన నివేదిక సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలలో అత్యంత వెనుకబబడిన కులాలకు కాకుండా మళ్లీ బలమైన వర్గాలకే అధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చారంటూ ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2011 జనాభా లెకలను పరిగణనలోకి తీసుకుంటే 57ఎంబీఎస్సీ కులాలకు నష్టం వాటిల్లుతుందని తాము మొదటి నుంచి చెప్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని వాపోయారు. 2000-2004 వరకు అమలైన వాటినే ఇప్పుడూ కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
ఉషామెహ్రా కమిషన్ గతంలో మాల, మాదిగ కులాల గ్రూపుల్లో ఉన్న వెనుకబడ్డ దళిత కులాలు తీవ్రంగా నష్టపోయాయని నివేదించినా, అదే విధానాన్ని పాటించి ఆయా ఎంబీఎస్సీ కులాలకు మళ్లీ మాల, మాదిగ ఉపకులాలు అనే ముద్ర వేశారని, వాటి ఉనికి లేకుండా చేయడానికి కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 ఎంబీఎస్సీ కులాలకు 6శాతం, మాదిగలకు 5శాతం, మాలలకు4శాతం రిజర్వేషన్లను కల్పిస్తే సరిపోయేదని, లేదంటే 10 శాతంలో మొత్తం 59 కులాల్లో నిరుపేదలను, ఏబీసీలుగా గుర్తించి, మిగిలిన 5 శాతంలో 59 కులాల వారిని ఏబీసీలుగా విభజిస్తే సరిపోయేదని సూచించారు. తమ డిమాండ్లు అటకెకించేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని నిప్పులు చెరిగారు. రాజకీయ ప్రయోజనాలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మిగతా 57 కులాలకు ద్రోహం చేసిందని వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీలను వర్గీకరించడాన్ని బీఎంఐ రాష్ట్ర అధ్యక్షుడు సర్వయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, వైస్ ప్రెసిడెంట్ మాందాల భాసర్ తీవ్రంగా ఖండించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక పూర్తిగా తప్పుల తడక అని, తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెకలు చూపించడం, మాలలను మాత్రమే కాదు తెలంగాణ సమాజాన్ని తప్పు దోవ పట్టించడమేనని మండిపడ్డారు. ఎంపైరికల్ డాటా సేకరించకుండా వర్గీకరణ అమలుకు పూనుకోవడం తీవ్ర అన్యాయమని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది మాలలకు, మాల ఉపకులాలకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 9 శాతం మాదిగలకు, 5 శాతం మాలలకు, 1శాతం ఇతర ఉప కులాలకు రిజర్వేషన్లను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు.