MLAs Poaching Case | న్యూఢిల్లీ, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుంద్రేశ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించకుండా స్టేటస్-కో(యథాతథ స్థితి) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. స్టేటస్ కో ఉత్తర్వుల అవసరం ఏమున్నదని, రికార్డులు సిట్ వద్దే ఉన్నాయి కదా? అని ప్రశ్నించింది.
హైకోర్టు తీర్పు ప్రకారం సీబీఐ దర్యాప్తు చేపట్టాలని చాలా ఆసక్తి చూపుతున్నదని దవే వివరించారు. రికార్డులు ఎవరి వద్ద ఉన్నాయని సుప్రీంకోర్టు అడిగింది. సిట్ వద్దే ఉన్నాయని, రికార్డులు ఇవ్వాలని సీబీఐ కోరుతున్నదని దవే బదులిచ్చారు. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ స్టే విధించాలని కోరారు. కనీసం స్టేటస్-కో ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. దీంతో.. ‘మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం.
కేసు సుప్రీంకోర్టు విచారణ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు కొనసాగించకూడదు. అలాంటి నిబంధన ఉన్నది. ఇందుకు విరుద్ధంగా సీబీఐ అడుగులు వేస్తే అది నిరుపయోగమే అవుతుంది. దర్యాప్తును చేపట్టినా నిరుపయోగంగా మారుతుంది. లేదంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కేసు స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, అప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. తదుపరి విచారణను జూలై 31కి విచారణ వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రతినిధులు చేసిన కుట్రను రాష్ట్ర పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సత్వర, సమగ్ర దర్యాప్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే కేసుతో ఏ ప్రమేయం లేని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా, పక్షపాతంగా జరుగుతున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. తర్వాత ముగ్గురు నిందితులు సింహయాజి, రామచంద్రభారతి, నందుకుమార్ కూడా హైకోర్టులో కేసులు వేశారు. మీడియా సమావేశంలో కేసు వీడియోలు బయటకు వచ్చాయని చెప్పి హైకోర్టు సింగిల్ జడ్జి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.