ముంబై, జూలై 18: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఈ ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్‌గా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ అవార్డును ప్రకటించినట్టు ఓ ప్రకటనలో శుక్రవారం ఎస్బీఐ తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లు, విశ్లేషకులు, కార్పొరేట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి అభిప్రాయాలను సేకరించి.. వాటిని సమగ్రంగా పరిశోధించి, విశ్లేషించిన తర్వాతే అవార్డుల కోసం ఎంపిక జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్బీఐ వివరించింది. కాగా, అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీలో జరుగబోయే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)/ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో భాగంగా ప్రపంచ అత్యుత్తమ బ్యాంక్ పేరిట ఈ ఏడాది అక్టోబర్ 18న నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టికి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ అవార్డును బహూకరించనున్నది.
కస్టమర్ల అనుభవం ప్రధానం: శెట్టి
‘మా (ఎస్బీఐ) వృద్ధికి ఖాతాదారుల అనుభవమే ప్రధాన వ్యూహం’ అని ఎస్బీఐ చైర్మన్ శెట్టి ఈ సందర్భంగా అన్నారు. ఎస్బీఐకి ఈ అవార్డు రావడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన కస్టమర్లకు, అంకితభావం కలిగిన ఉద్యోగులకు, ఇతర భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంతర డిజిటల్ సేవలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ అంతరాయం లేని బ్యాంకింగ్ కార్యకలాపాలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని, ఖాతాదారులకు అత్యుత్తమ బ్యాంకింగ్ సేవల అనుభూతిని అందజేస్తున్నామన్న ఆయన.. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సర్వీసులనూ విస్తృతం చేస్తున్నట్టు వెల్లడించారు. 52 కోట్లకుపైగా కస్టమర్లకు సేవలందిస్తున్న ఎస్బీఐ నిబద్ధతకు ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఎక్కడ ఎస్బీఐ కార్యకలాపాలున్నా అక్కడ తమ ఖాతాదారులకు ప్రపంచ శ్రేణి బ్యాంకింగ్ సేవల్ని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.