హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మనం తినే ఆహారం 95 శాతం మట్టినుంచే వస్తున్నది. అలాంటి మట్టి రోజురోజుకు ఇసుకగా మారి నిస్సారమైపోతున్నది. ఇలాగే వదిలేస్తే ఎడారిగా మారటానికి ఎంతోకాలం పట్టదు. ఈ నేపథ్యంలోనే మట్టిని రక్షించుకొనేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్ ‘సేవ్ సాయిల్’ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మార్చి 21న బ్రిటన్ రాజధాని లండన్ నుంచి ఆయన ఒంటరిగా బైక్ ప్రయాణం మొదలుపెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యూరప్, మధ్యప్రాచ్యంలో ఇప్పటివరకు 26 దేశాల్లో పర్యటించారు. ఈ యాత్ర ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్ ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. 25 రోజులపాటు 9 రాష్ర్టాల్లో ప్రయాణించి ఈ నెల 15న హైదరాబాద్‌కు చేరుకోనున్నది. ఈ ఉద్యమానికి ఇప్పటికే పలువురు మద్దతు ప్రకటించారు. తెలంగాణలోని 1.40 లక్షల మంది విద్యార్థులు ఉత్తరాలు రాశారు. సినీ తారలు రకుల్‌ప్రీత్‌సింగ్, నిత్యామీనన్, లావణ్య త్రిపాఠి, ప్రజ్ఞాజైశ్వాల్, శిల్పారెడ్డి, మానస వారణాసి, మంగ్లీ, తనికెళ్ల భరణి, కోన వెంకట్, సాయికుమార్, సామవేదం షణ్ముఖశర్మ తదితరులు ఉద్యమానికి మద్దతు తెలిపారు.