మణుగూరు టౌన్/కోటగిరి, సెప్టెంబర్ 3: సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ‘సేవ్ పాలిటెక్నిక్ – సేవ్ అవర్ ఫ్యూచర్’ అనే నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వచ్చి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శక్తి స్కీమ్‌తో విద్యార్థులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట శక్తి పాలసీని తీసుకొచ్చి డిప్ల్లమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదని అన్నారు. ఎస్బీటీఈటీని తొలగించే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.