Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 24 : ‘మా నానమ్మ కష్టార్జితంతో ఆరు గుంటల భూమి కొనుగోలు చేసింది. దానిని ఓ పోలీసు అధికారి దౌర్జన్యంగా ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నా డు. దీనిని అడ్డుకోబోతే మా అమ్మానాన్నలపై కేసులు పెట్టి, జైలుకు పంపాడు’ అంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన చిన్నారులు కాటిపల్లి శ్వాస, సృష్టిసాయి కలెక్టర్ పమేలా సత్పతికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆ చిన్నారులు కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. ‘చట్ట ప్రకారం అన్ని డాక్యుమెంట్లు ఉన్నా అధికార బలంతో మా పేద కుటుంబంపై పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. రెవెన్యూ, పోలీస్ అధికారులు కుమ్మక్కై మా భూమిని ఆక్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, మాకు న్యాయం చేయాలి. దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.’ అంటూ దీనంగా వేడుకున్నారు.