మయూరిసెంటర్, మే 17 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్సకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థికంగా సతమతమవుతున్నానని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో చికిత్స చేయించుకొనే పరిస్థితి లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట జడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందినట్టు తెలిపారు.
ప్రభుత్వం నుంచి తనకు వివిధరకాల బెనిఫిట్స్ రూ. 60 లక్షల వరకు రావాల్సి ఉందని అన్నారు. ఆరోగ్యం క్షీణించడం, గుండెకు రక్తప్రసరణ సరిగా లేక వైద్యులు రెండు స్టంట్లు వేశారని చెప్పారు. ప్రస్తుతం క్యాన్సర్, ఇతర వ్యాధులకు చికిత్స తీసుకోవాలంటే దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం విడుదల చే యకపోవంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని, సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, ఆ ర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి స్పందించాలని కోరారు. కలెక్టర్, డీఈవో, ఇతర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.