హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో హైదరాబాద్‌లో ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు గురువారం భారీ ర్యాలీ తీశారు. ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, వామపక్ష నేతలు కలిసి నెక్లెస్ రోడ్ మీదుగా ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీ లోక్‌భవన్‌కు చేరుకోకుండా పోలీసులు నెక్లెస్ రోడ్లో బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుపెట్టారు.
నిరసనకారులు వాటిని తొలగించి ముందుకెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్లను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారితోపాటు టీపీసీసీ చీఫ్ మహేశకుమార్‌గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని అదుపులోకి తీసుకున్నారు.