హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ ఉండేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు (ఈ నెల 24న) సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆదివారం ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మహిళా సంఘం (టీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో షీ టీమ్స్‌తో భరోసా ఉండేదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ ఆడబిడ్డల పేరిటే అందించారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, రేషన్‌కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయని వివరించారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, టీఎంఎస్ అధ్యక్షురాలు డీ పద్మ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకురాలు అర్పితప్రకాశ్, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.