Lagacherla Case | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలనకు పరాకాష్ట లగచర్ల ఘటన అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ నేతలు కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ను శనివారం కలిశారు. కమిషన్ చైర్మన్కు పిటిషన్ను సమర్పించారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు కోరారు. అనంతరం సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. కలెక్టర్, అధికారులపై దాడి చేశారని అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారని, దాడి చేశారని మండిపడ్డారు. రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా ? అంటూ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి అధికారం , దూరంకారం గిరిజనులపై చూపిస్తున్నాడని మండిపడ్డారు. భూమిపుత్రుల భూములను గుంజుకొనే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. వారి కడుపుకాలి తిరగపడితే వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు. ఫార్మా సిటీ ప్రయత్నాన్ని విరమించుకొని.. గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తున్నామని.. కానీ, ఒక కలెక్టర్ అక్కడికి వెళ్తే ఒక్క పోలీస్ అధికారి లేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏమైంది ? అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కక్ష రాజకీయాలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.
లగచర్లలో దాడి జరిగింది అధికారులపై కాదని.. గిరిజన ప్రజల మీద అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని కమిషన్ను కోరారు. గిరిజన ప్రజలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ న్యాయం చేస్తుందని నమ్ముతున్నామన్నారు. గిరిజన ప్రజల ఫై లైంగిక దాడులు చేశారని మహిళలు చెపుతున్నారని.. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కోరారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదన్నారు. భూములు కోల్పోతున్న గ్రామస్తులు తమను కలిశారని.. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాలన్నారు. స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారని.. లగచర్ల గ్రామంలో కమిషన్ త్వరలో పర్యటిస్తుందని.. కమిషన్ ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుందని.. అన్యాయం జరిగితే కమిషన్ అసలు ఊరుకోదన్నారు. అధికారులపై జరిగిన దాడులు కమిషన్ ఖండిస్తుందన్నారు. కమిషన్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు, జాన్సన్ నాయక్, రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.