మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 3 : అతి తక్కువ కాలంలో సీఎం రేవంత్రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం ముఖ్య నాయకులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో కుంటలు, చెరువులు నీటితో కళకళలాడగా, ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువుల్లో నీళ్లు లేవని, పంట పొలాలు ఎండి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారం కోసం హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ వరంగల్ జిల్లా మీద అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను ఎల్కతుర్తిలో పెడుతున్నారని, నాయకులంతా కలిసి సభను విజయవంతం పిలుపునిచ్చారు.