సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 25: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి విద్యార్థి ఉద్యమాల నుంచి విప్లవోద్యమాలు చేశారని, 40 ఏండ్ల పాటు ఉద్యమంలో ఉన్న ఆయన బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలాది మందితో కూడిన సభలోనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లెలో కడారి భౌతిక కాయానికి దేవీప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యనారాయణరెడ్డి, తాను విద్యార్థి ఉద్యమాల్లో కలిసి పనిచేశామని గుర్తుచేశారు.