హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టంతో మ్యాపింగ్ చేయనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీఆర్ఏసీ) అదనపు డైరెక్టర్ జనరల్ జీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పరిశోధకులు, అధికారులతో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, రాష్ట్ర, జాతీయ రహదారులు ఉన్నాయని తెలిపారు. ఈ నాలుగు రకాల రోడ్ల పొడవు, వెడల్పు, స్థితిగతులు, రోడ్డు మార్గమధ్యలో కల్వర్టులు, బ్రిడ్జిల ఆవశ్యకతను శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టం ద్వారా మ్యాపింగ్ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో డబుల్ , నాలుగు లేన్ల రోడ్లు ఉన్నాయని, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉందని వెల్లడించారు. భవిష్యత్తులో షార్ట్‌కట్ రోడ్స్ కనెక్టివిటీ సిస్టం కోసం శాటిలైట్ మ్యాపింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సిస్టం రోడ్ మ్యాపింగ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు గైడ్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. నిర్ణీత గడువులోగా రోడ్డు శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు రాజోజు నరసింహాచారి, మోహన్‌రెడ్డి, బాలకృష్ణ, గౌతమ్, ప్రకాశ్, భాసర్‌రెడ్డి, అశ్విన్, కమలాకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.