నంగునూరు, ఆగస్టు 4 : శాతవాహనుల కాలంలో నంగునూరు ఒక చారిత్రక ప్రదేశంగా విరాజిల్లిందని, అందుకు నిదర్శనం పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు లభించాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా నంగునూరులో క్షేత్రస్థాయిలో పరిశోధించగా.. పాటిగడ్డ మీద వేల ఏండ్ల నాటి మానవ నాగరికత, సంస్కృతికి చెందిన వస్తువుల ఆధారాలు, పురాతన వస్తువులు, ఎర్రబంక మట్టితో చేసిన పూసలు, పెండేంట్లు, బొమ్మలు లభించినట్టు ఆయన పేర్కొన్నారు. బొమ్మల్లో అమ్మదేవతలు, వివిధ జంతువుల రూపాలు ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రజలు వాటిని అలంకరణ నగలుగా ధరించే వారని తెలిపారు. క్షేత్ర పరిశోధనలో తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తదితరులు ఉన్నారు.