Mancherial | నెన్నెల, డిసెంబర్ 21 : ‘లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి గ్రామాభివృద్ధికి పెట్టిన. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా రాలే. ఉండటానికి నాకు ఇల్లు లేదు. అందుకే నేను కట్టిన జీపీ భవనంలోనే నివాసం ఉంటున్న. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేట మాజీ సర్పంచ్ డోలే చిన్నక్క కొడుకు శంకర్ స్పష్టంచేశాడు.
2014-15లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12లక్షలు మంజూరు చేయడంతో అప్పుడు సర్పంచ్ కొడుకు శంకర్ నిర్మాణం చేపట్టాడు. స్లాబ్ పూర్తయినప్పటికీ బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగు చెందాడు. చివరకు పంచాయతీ భవనంలోనే నివాసం ఉంటున్నాడు. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లగా శుక్రవారం అధికారులు కోణంపేటకు వెళ్లి విచారణ చేపట్టారు. భవనాన్ని విడిచి వెళ్లాలని శంకర్‌కు చెప్పినా బిల్లులు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పాడు.