ఇనుగుర్తి, జూన్ 20 : కేసీఆర్ హయాంలో ఇచ్చిన అటవీ భూముల ను ఓ కాంగ్రెస్ సర్పంచ్ దౌర్జన్యంగా లాక్కొనే యత్నంచేయగా మనోవేదనతో బాధితరైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రాముతండా జీపీలో జరిగింది. బాధిత రైతు సపావట్ రవినాయక్ మాట్లాడుతూ.. తమ తాతలనుంచి అటవీ భూమిని సాగుచేసుకో గా, కేసీఆర్ ప్రభుత్వంలో 1.38 ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. గ్రామ సర్పంచ్ మీటూనాయక్, జీపీ సిబ్బంది చంద్రు ఆ భూమి గ్రామపంచాయతీకి చెందుతుందని మూడు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న ట్టు వాపోయాడు. తనతోపాటు మరో 8మంది రైతులకు ఇచ్చిన 20 ఎకరాల భూమిలో సర్పంచ్, జీపీ సిబ్బంది చంద్రు దగ్గరుండి జేసీబీతో ట్రెంచ్ తీయించినట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నానని మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగులమందుతాగినట్టు చెప్పాడు. తహసీల్దార్ శ్రీనివాసులు ఘటనా స్థలానికి వెళ్లగా, బాధిత రైతు రవినాయక్ తల్లి సాలమ్మ సర్పంచ్ దౌర్జన్యాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. అటవీ భూమిని పంచుతానని తండాలోని కొంతమంది దగ్గర సర్పంచ్ డబ్బులు వసూ లు చేశాడని, వారు భూమి అడగడం తో తమ భూముల వద్ద ట్రెంచ్ తీయిస్తున్నాడని సాలమ్మ తెలిపింది. అటవీ అధికారులు చేరుకొని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్వో విజయలక్ష్మి తెలిపారు.